కొవిడ్ వాహకులకు టీకా కోసం ఇవ్వాల్సిన టోకెన్లు పక్కదారి పట్టాయి. వాహకుల(సూపర్ స్ప్రెడర్లు) కోసం చేపట్టిన ఈ కార్యక్రమం శుక్రవారం తొలిరోజే గందరగోళానికి దారితీసింది. పలువురు జీహెచ్‌ఎంసీ అధికారులు టోకెన్ల జారీలో ఇష్టానుసారం వ్యవహరించారు. ప్రభుత్వం గుర్తించిన వారికి కాకుండా.. తమ స్నేహితులు, బంధువులు, తెలిసిన వారికి టోకెన్లు ఇచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం గోషామహల్ సర్కిల్ పరిధిలోని రెడ్ రోజ్ ఫంక్షన్‌హాల్ టీకా కేంద్రాన్ని తనిఖీ చేయగా ఈ విషయం వెలుగు చూసింది. తాము ప్రైవేటు ఉద్యోగులమంటూ వరుసలో నిలబడిన వ్యక్తులు ఆయనకు సమాధానం ఇచ్చారు. అనర్హులకు టోకెన్లు ఎందుకిచ్చారని ఆయన బల్దియా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన గోషామహల్ సర్కిల్ ఉప కమిషనర్ శ్రీనివాసు, ఏఎంఓహెచ్ ఉమాగౌరికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ ఛార్జి మెమో జారీ చేశారు.
21 వేల మందికి పైగా..!
తొలి రోజు నగరవ్యాప్తంగా 21,666 మంది వాహకులకు టీకా వేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పది రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఉపసభాపతి పద్మారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పలు కేంద్రాలను పరిశీలించారు.