దేశంలో ప్రైవేటు రియల్ ఎస్టేట్ డెవలపర్లతో ఏర్పడిన అత్యున్నత సంస్థ క్రెడాయ్. విశేష ప్రాచుర్యం కలిగిన క్రెడాయ్ సంస్థ నిర్వహించే ప్రాపర్టీ షోకు ఏటా మంచి స్పందన వస్తుంటుంది. బిల్డర్లతో పాటు నిర్మాణరంగ పరిశ్రమలో ఉన్న మెటీరియల్ వెండర్లు, బ్యాంకర్లు, తయారీదారులు, నిపుణులు ఇలా అందర్నీ ఒక్కతాటిపైకి తెచ్చి నిర్వహించే భారీ ప్రదర్శన క్రెడాయ్ ప్రాపర్టీషో. ఈ ప్రదర్శనలో కొనుగోలుదారుల అవసరాలకనుగుణంగా ఈసారి 15 వేలకుపైగా ప్రాపర్టీలను మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ప్రదర్శిస్తున్నారు. కొనుగోలుదారులకు ఈఎంఐ, లోన్ సౌకర్యం అందించే బ్యాంకర్లు సైతం ఇక్కడ అందుబాటులో ఉంటారు. మూడు రోజులు జరిగే ఈ ప్రదర్శనలో.. దిగువ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో సొంతిళ్ల నుంచి.. విలాసవంతమైన విల్లాలు ఆఫర్ చేస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ప్రతి యేటా 150 స్టాళ్లు నిర్వహించే యాజమాన్యం.. ఈ సారి వాటిని 100కే పరిమితం చేసింది.
క్రెడాయ్ ఇప్పుడు అత్యున్నత స్థానంలో ఉంది. హైదరాబాద్ నగరానికి త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్డు రానుంది. దీని ద్వారా హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి ఆకాశమే హద్దు. నగర అభివృద్ధికి ప్రభుత్వ సహకారమూ ఉంటుంది. -వేముల ప్రశాంత్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి
హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా స్థిరాస్తి రంగంపై కొవిడ్ ప్రభావం పడినా.. హైదరాబాద్‌లో మాత్రం ఆశాజనకంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రీజనల్ రింగ్ రోడ్డు ద్వారా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మరింత ఊపందుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
రెండు మూడేళ్ల క్రితం హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో అభివృద్ధి కనిపించింది. కొవిడ్ తర్వాత కొన్ని మార్పులు వచ్చాయి. రియల్ ఎస్టేట్ రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. వినియోగదారులు కూడా విలాసవంతంగా ఉండే ఇళ్లు, విల్లాలకే ప్రాధాన్యమిస్తున్నారు. భూమి ధరలు, నిర్మాణ వ్యయమూ పెరిగింది. అందుకే త్వరగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. -రామకృష్ణారావు, తెలంగాణ క్రెడాయ్ అధ్యక్షులు
గతేడాదితో పోలిస్తే నిర్మాణ వ్యయం పెరిగి ప్రాపర్టీల ధరలు పెరిగినా.. డిమాండ్‌కు కొరత లేదని బిల్డర్లు అంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నగరం దేశంలోనే మిన్నగా రాణిస్తోందని తెలంగాణ క్రెడాయ్ అధ్యక్షులు రామకృష్ణరావు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండింపెండెంట్ ఇళ్లు, విల్లాలకు డిమాండ్ పెరుగుతోందని ఆయన అన్నారు. మూడు రోజుల జరిగే క్రెడాయ్ ప్రాపర్టీ షో.. కొనుగోలుదారులు, బిల్డర్లు, డెవలపర్లకు మంచి వ్యాపారాన్ని అందించనుంది.
ఇదీ చదవండి: 75th Independence day : దేశభక్తిని చాటుకోండిలా... యువతకు కేంద్రం అద్భుతావకాశం!