నిత్యం సమాజంలో ఉండే పోలీసులు ఎన్నో గొడవలను, అల్లర్లను ఆపుతుంటారు. ఎన్నో సమస్యలకు పరిష్కారాలను అందిస్తుంటారు. గాయాలైనప్పుడు చికిత్స అందించడం కూడా తెలిస్తే ఎంతో మంది ప్రాణాలను పోలీసులు కాపాడుతారు. అందుకే దీనిని దృష్టిలో పెట్టుకుని కామినేని ఆస్పత్రి తలకు గాయాలైనప్పుడు చేసే చికిత్స, సీపీఆర్లపై శిక్షణ ఇచ్చేందుకు అవగాహన కార్యక్రమాన్ని మార్చి 20న ప్రారంభించారు.
ప్రపంచ హెడ్ ఇంజ్యూరీ అవేర్ నెస్ రోజు ( మార్చి 20 ) సందర్భంగా ఎల్బీ నగర్ లోని కామినేని హాస్పిటల్ లో రాచకొండ పోలీస్ సిబ్బంది కోసం హెడ్ ఇంజ్యూరీ, సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ ప్రారంభించారు. ఆకస్మాతుగా తలకు గాయాలైనప్పుడు ఎలా చికిత్స చేయాలి? అత్యవసర సమయాల్లో కార్డియో, పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేయడానికి అవసరమైన మెలకువలను, నైపుణ్యాలను పోలీసులకు నేర్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఎల్బీనగర్ డీసీపీ డీ సాయి శ్రీ, ఎల్బీనగర్ డీసీపీ (ట్రాఫిక్) డీ శ్రీనివాస్‌లు హాజరయ్యారు.
అవగాహన అవసరం : అత్యవసర స్పందనలో కీలక పాత్ర పోషించే పోలీసు సిబ్బందికి, తలకు గాయాలు, సీపీఆర్ శిక్షణ గురించి అవగాహన కల్పించడానికి గల 5 ప్రాముఖ్యతలను వక్తలు వివరించారు. తలకు అయ్యే గాయాలు, వాటిలో రకాలు, కారణాలు, సంకేతాలు, లక్షణాలు, తగిన స్పందన, చికిత్స వంటి అంశాలను ఈ కార్యక్రమంలో కామినేని వైద్యులు సమగ్రంగా వివరించారు. ఇందులో పాల్గొన్న వారికి ఛాతీ కుదింపులు, రెస్క్యూ శ్వాసతో సహా సీపీఆర్‌లో శిక్షణ ఇచ్చారు.
సదస్సులో రాచకొండ పోలీస్ కమిషనర్, డీ ఎస్ చౌహాన్ మాట్లాడుతూ... ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కామినేని హాస్పిటల్స్ యాజమాన్యాన్ని అభినందించారు. పోలీసులు ఎల్లప్పుడూ బహిరంగ ప్రాంతాల్లో పనిచేస్తూ... తలకు గాయాలు, ఆకస్మిక గుండెపోటులను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. వాగ్వాదాలు, మోటారు వాహన ప్రమాదాలు, పడిపోవడం వంటి వివిధ పరిస్థితులలో తలకు గాయాలు సంభవించవచ్చనిత తెలిపారు. పోలీసు అధికారులు తల గాయాల సంకేతాలు, లక్షణాలను గుర్తించడం, తగిన విధంగా స్పందించడం చాలా ముఖ్యమన్న సీపీ... అదనంగా, వారు సీపీఆర్ని ఎలా నిర్వహించాలో కూడా తెలుసుకోవాలని సూచించారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడుతుందని వివరించారు.
ఇవీ చదవండి: