కేంద్ర ప్రభుత్వం కొవిడ్ వ్యాక్సిన్ వ్యాపారాన్ని ఆపేసి.. ప్రజలందరికీ ఉచిత టీకా అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విరుచుకుపడి ప్రజల ప్రాణాలు బలితీసుకుంటోందన్నారు. ఒక్కరోజే 3 లక్షలకు పైగా కేసులు నమోదు కావడంతో దేశం ప్రమాదపుటంచులో ఉందనే సంకేతం చూపిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం టీకా ధరను మూడు రకాలుగా నిర్ణయించి వ్యాపారానికి పూనుకుంటోందని ఆరోపించారు. కేంద్రం చేస్తున్న ఈ వ్యాపారాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. వ్యాక్సిన్ ధర మొత్తాన్ని కేంద్రమే భరించి ప్రజలందరికీ ఉచితంగా టీకా వేయాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్, ఆక్సిజన్, పడకలతో పాటు, రెమ్‌డెసివిర్ కొరత తీవ్రంగా ఉందని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు కరోనా కేసులు, మరణాలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతుంటే కేంద్రం మీనమేషాలు లెక్కపెడుతూ రాష్ట్రాల మీద భారాలు వేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఒకే దేశం, ఒకే చట్టమని ఊదరగొట్టే మోదీ ప్రభుత్వం ఒకే వ్యాక్సిన్.. ఒకే ధర అని చెప్పకపోవడం శోచనీయమన్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ కరోనాతో మృతి చెందడం పట్ల సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, వీరభద్రం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను అధిగమిస్తాం: మంత్రి గంగుల