దేశంలో తరచూ ఉగ్రవాద దాడులతో భద్రతా సిబ్బంది మరణిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ దాడులకు పాకిస్థానే కారణమని చేతులు దులుపుకుంటోందని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు మాత్రం నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం లేదని అయన మండిపడ్డారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ధైర్య సైనికులకు వందనం కార్యక్రమం నిర్వహించి... అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు.
కార్పొరేట్లకు మాత్రమే వికాస్...
దేశ సంపదను కార్పొరేట్, విదేశి పెట్టుబడిదారులకు అమ్ముకోవడంలో ప్రధాని మోదీకి ఉన్న ఆసక్తి దేశ భద్రతపై లేదని... ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌డీఏ ప్రభుత్వం శ్రమించే ప్రజలందరి జీవితాలను నాశనం చేస్తోందని విమర్శించారు. సబ్కా సాత్ - సబ్కా వికాస్ అని, ఎంచుకున్న కొన్ని కార్పొరేట్ కంపెనీల వికాస్(అభివృద్ధికి) మాత్రమే తోడ్పడుతుందని ఆరోపించారు.
అంతా ఏకం కావాలి...
దేశంలో ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం విఫలమైందని చాడ అన్నారు. 2014లో విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తామన్న భాజపా హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న బలహీన విధానాలకు నిరసనగా ఉద్యమాలను ఉద్ధృతం చేయవలసిన అవసరముందన్నారు. అందుకోసం వామపక్ష, ప్రజాతంత్ర వాదులందరూ ఏకం కావాలని చాడ వెంకట్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: గిరిజన పండుగలకు నిధులు మంజూరు