కొవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డీ.రాజా విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్ వేదికగా జరగుతున్న పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు భాగ్యనగరానికి వచ్చిన రాజా జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రారంభించారు.
రాబోయే పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అస్సాం, తమిళనాడు ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆయా రాష్ట్ర నాయకత్వాలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు కమ్యూనిస్టులకు అతి ముఖ్యమైనవి అన్నారు. పార్టీ సభ్యత్వంతో పాటు బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యవర్గ సమావేశానికంటే ముందు జాతీయ కార్యవర్గం సమావేశమై.. జాతీయ సమితి సమావేశాల ఏజెండాను రూపొందించింది. రేపు ఉదయం జాతీయ సమితి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి.
బాలిక విరాళం..
హైదరాబాద్ వేదికగా జరగుతున్న సీపీఐ జాతీయ సమితి సమావేశాలకు నరసరావుపేటకు చెందిన ఉదయలక్ష్మి రూ. 1,099 విరాళంగా ఇచ్చింది. గుంటూరు జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కాసారాంబాబు కుమార్తె ఉదయలక్ష్మి ప్రస్తుతం పదవ తరగతి చదువుతుంది. ఈ విరాళాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణకు అందజేసింది. నారాయణ ఈ విరాళాన్ని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డికి అందజేశారు. చిన్న వయసులోనే ఈ అమ్మాయి చూపిన స్ఫూర్తిని సీపీఐ నేతలు అభినందించారు.
ఇదీ చూడండి: 6 తో కలిపి 35.. విలువ సుమారు రూ. 7 లక్షల 50 వేలు