కర్ఫ్యూ సమయంలో మెడికల్ ఎమర్జెన్సీని దృష్టిలో ఉంచుకుని రాచకొండ కమిషనరేట్లో నాలుగు క్యాబ్లను సోమవారం కమిషనర్ మహేశ్ భగవత్ ఎల్బీనగర్ క్యాంప్ కార్యాలయం ఆవరణలో ప్రారంభించారు.
అవసరం అయితే కాల్ చేయండి
ఈ క్యాబ్స్ వనస్థలిపురం శ్రీనివాస టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీ అందుబాటులో ఉంచింది. ఇవి ఎల్బీనగర్, వనస్థలిపురం, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం పరిధిలో రాత్రి కర్ఫ్యూ సమయంలో వినియోగించుకోవచ్చు. ఈ అవకాశాన్ని సీనియర్ సిటీజన్స్, గర్భిణులు, అనారోగ్యంతో అత్యవసర వైద్య సాయం అవసరం ఉన్న మహిళలు ఉపయోగించుకోవచ్చునని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. దీని కోసం రాచకొండ కంట్రోల్ నెంబర్ 9490617234కు ఫోన్ చేస్తే సరిపోతుందనీ, గతంలో కూడా ఇలాంటి సౌకర్యాలను కమిషనరేట్ తరుఫున ఏర్పాటు చేసిందని సీపీ గుర్తు చేశారు.
ఈ సర్వీస్ కొవిడ్ బాధితుల కోసం కాదనీ ఆయన స్పష్టం చేశారు. కొవిడ్ కాకుండా ఇతర వ్యాధులు, నాన్ కొవిడ్ ఎమర్జెన్సీ సర్వీస్ కోసం ఈ వాహనాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో క్యాబ్ సర్వీసులకు సహకరించిన ట్రావెల్స్ ఎండీ శ్రీనివాస్ రావుకు రాచకొండ కమిషనరేట్ తరుఫున ధన్యవాదాలు తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి
మే 1 నుంచి 18 సంవత్సరాల పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. యువత అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. రాచకొండ కమిషనరేట్లో గతేడాది 1,339 మంది పోలీసులు కొవిడ్ బారిన పడ్డారని తెలిపారు. ఈసారి కూడా 300 మందికి కొవిడ్ సోకిందని చెప్పారు. వైరస్ బారిన పడిన వారి ఖాతాలో 5000రూపాయలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అందరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని వివరించారు.
ఇదీ చదవండి: కరోనా ఆంక్షలు బేఖాతరు- యువకులతో కప్పగంతులు