ఎన్నికల వేళ రాష్ట్రంలో భారీగా నగదు పట్టుబడుతోంది. ఇప్పటివరకు 9 కోట్ల 45 లక్షల నగదును స్వాధీనం చేసుకోగా తాజాగా 3 కోట్ల 29 లక్షల నగదును పట్టుకున్నారు. డబ్బు తరలిస్తున్నారనే సమాచారంతో బంజారాహిల్స్ పోలీసులు నిఘా పెట్టగా నిన్న సాయంత్రం నాలుగు గంటలకు జహీరానగర్లో రూ. కోటికి పైగా పట్టుబడిందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. నిందితులను విచారిస్తే.. వారిచ్చిన సమాచారం మేరకు ఇంట్లోనూ తనిఖీలు చేశారు. సోదాల్లో 2 కోట్లకు పైగా నగదు పట్టుబడిందని స్పష్టం చేశారు. ఈ కేసులో 8 మందిని అదుపులో తీసుకున్నామని విచారణ అనంతరం నిందితులపై కేసులు నమోదు చేస్తామని వివరించారు.
ప్రజల సహకారానికి కృతజ్ఞతలు
ప్రజల సమాచారంతోనే 70 శాతం నగదు పట్టుకోగలిగామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. ప్రజలు మరింత సహకరిస్తే ఎన్నికల్లో ధనప్రవాహం లేకుండా చేస్తామన్నారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న నగదునంతా ఐటీశాఖకు అప్పగించినట్లు వెల్లడించారు.
ఉల్లంఘనులపై 200 కేసులు
ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద 200 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా1869 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని అంజనీకుమార్ స్పష్టం చేశారు. నగదు తరలింపు ఘటనల్లో వెంటనే కేసులు నమోదు చేయట్లేదని... ముందుగా విచారణ జరిపి ఆ తర్వాతే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో నగదుతో పట్టుబడిన వారిలో 19 మందికి శిక్షలు పడ్డాయని సీపీ అంజనీకుమార్ తెలిపారు.
ఇవీ చదవండి: తెరాస తీర్థం పుచ్చుకోనున్న మండవ వెంకటేశ్వరరావు