రాష్ట్రంలో అర్హులందరికీ కొవిడ్ టీకాలు లక్ష్యంగా నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం కానుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసే స్పెషల్ డ్రైవ్(Covid Vaccination Special Drive)పై అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. హనుమకొండ కలెక్టరేట్ నుంచి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao), హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి సీఎస్ సోమేశ్ కుమార్ (Cs Somesh Kumar), ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
వారికి వెంటనే...
అందరికీ వ్యాక్సినేషన్ కోసం సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డుసభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. గ్రామస్థాయిలో వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న మంత్రి... మహిళా గ్రూపు సంఘాలతో సమన్వయం చేసుకోవాలని డీఆర్డీఓలను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో అత్యవసర పడకలు ఏర్పాటు చేసుకోవాలని, మొదటి డోసు వ్యాక్సినేషన్ తీసుకోని వాళ్లకు వెంటనే వేయాలని చెప్పారు.
బాగా పనిచేసిన వారికి అవార్డులు...
గ్రామస్థాయిలోనే వ్యాక్సినేషన్ క్యాంపు ఏర్పాటు చేయాలని ఎర్రబెల్లి తెలిపారు. వైద్య,ఆరోగ్య సిబ్బందికి పూర్తి సహాయ సహకారాలు అందించి స్పెషల్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో బాగా పనిచేసిన వారికి జిల్లా, మండల, గ్రామ స్థాయిలో అవార్డులు ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. కరోనా ఉద్ధృతి సమయంలో లాక్డౌన్ అమలుతో పాటు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు అండగా నిలిచారని అభినందించిన ఆయన... అదే స్ఫూర్తితో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను విజయవంతం చేసేలా కృషి చేయాలని చెప్పారు.
రోజూ 3 లక్షల మందికి...
కరోనా మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు రోజూ మూడు లక్షల మందికి టీకాలు ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పూర్తి నియంత్రణలో ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడకూడదన్న సదుద్దేశంతోనే ఈ డ్రైవ్ చేపట్టాలని సీఎం నిర్ణయించారని వివరించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు 18ఏళ్లు పైబడిన వారు 2 కోట్ల 80 లక్షల మంది ఉన్నారని... అందులో ఇప్పటి వరకు కోటి 45 లక్షల మంది మొదటి డోస్ తీసుకున్నారని చెప్పారు. 55 లక్షల మంది రెండో డోస్ తీసుకున్నట్లు సీఎస్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా పూర్తిస్థాయి నియంత్రణకు వ్యాక్సినేషన్లో పెద్దఎత్తున ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు.
ప్రతిరోజూ పది నిమిషాల సమయాన్ని వెచ్చించి వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సమీక్షించాలని అధికారులకు సూచించారు. కంట్రోల్ రూమ్ నిర్వహణ నిరంతరం కొనసాగించాలని... వ్యాక్సినేషన్ పూర్తైనట్లు స్టిక్కర్లు వేయాలని సోమేశ్ కుమార్ చెప్పారు. పంచాయతీలలో దండోరా వేయించాలని... విస్తృత ప్రచారం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Vaccination: తెలంగాణలో రెండు కోట్ల మందికి కొవిడ్ వాక్సినేషన్ పూర్తి