టీకాల పంపిణీలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. టీకాల లభ్యత... అర్హులను దృష్టిలో ఉంచుకుని విడతల వారీగా అర్హులకు టీకాలు ఇస్తున్న అధికారులు ఇటీవల 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రారంభించింది. కనీసం ఒక్క డోస్ టీకా తీసుకున్నా... పాక్షిక రక్షణ కలుగుతుందన్న అధ్యయనాలను దృష్టిలో ఉంచుకుని వీలైనంత మందికి మొదటి డోస్ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇక గడచిన నెలరోజుల్లోనే ఏకంగా 52 లక్షల మందికి పైగా టీకాలు అందించి భేష్ అనిపించుకుంది.
కరోనా కట్టడిలో టీకానే కీలకం
కరోనా మహమ్మారి కట్టడిలో టీకా కీలక పాత్ర పోషిస్తోందని ఇప్పటికే పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో వైరస్ సోకినప్పటికీ తీవ్ర లక్షణాలు కనిపించటం లేదని అనేక సైన్స్ జర్నల్స్ ప్రచురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కనీసం ఒక్క డోస్ టీకా అయినా పూర్తి చేసే లక్ష్యంతో తెలంగాణ సర్కారు ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా మొదటి డోస్ కొవిషీల్డ్ తీసుకున్న వారికి ... 12 నుంచి 16 వారాల వ్యవధిలో రెండో డోస్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో మాత్రం 14 నుంచి 16 వారాల వ్యవధిలో మాత్రమే రెండో డోస్ టీకా ఇస్తామని తెలిపింది. కొవాగ్జిన్ తీసుకున్న వారికి యథాతథంగా 28 రోజుల వ్యవధి ముగిసిన తర్వాతే రెండో డోస్ టీకా ఇవ్వనున్నట్లు సర్కారు ప్రకటించింది. ఫలితంగా ఎక్కువ మందికి టీకాలు ఇచ్చే అవకాశం ఏర్పడిందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు తెలిపారు.
వాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లు
ఇక ప్రాధాన్యతా క్రమంలో హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారు, 45 ఏళ్లు దాటినవారు వారు అంటూ విడతల వారీగా అర్హులకు టీకాలు అందిస్తున్న సర్కారు... ఇటీవల ప్రజలతో ఎక్కువగా మమేకమై.... కొవిడ్ వైరస్‌కు గురయ్యే అవకాశం ఉందని భావించిన సూపర్ స్ప్రెడర్లను గుర్తించి దాదాపు ఐదు లక్షల మందికి టీకాలు అందించింది. ఇప్పుడు 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు ఇస్తున్న సర్కారు.. వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ మందికి టీకాలు ఇచ్చేందుకు గాను ప్రత్యేకంగా డ్రైవ్‌లను నిర్వహిస్తోంది. మరోవైపు మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా సైతం టీకాలు ఇస్తోంది.
మూడో వేవ్ దృష్ట్యా శరవేగంగా పంపిణీ
కొవిడ్ రెండో వేవ్ ప్రభావం.. మూడో వేవ్ వస్తే ఎదురయ్యే ముప్పును దృష్టిలో ఉంచుకుని టీకా కార్యక్రమాన్ని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ శరవేగంగా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 2.2 కోట్ల మంది కొవిడ్ టీకా తీసుకునేందుకు అర్హులుగా గుర్తించిన సర్కారు వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరికీ అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జూన్‌లో టీకా పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేసిన వైద్య, ఆరోగ్య శాఖ... ఒక్క జూన్ నెలలోనే ఏకంగా 52,71,548 టీకాలు పంపిణీ చేసింది. అంటే రోజుకి సుమారు 1,75,718 వ్యాక్సిన్లు అందించింది.
జూన్ 1వ తేదీ నాటికి రాష్ట్రంలో మొత్తం 61,50,211 టీకాలు ఇవ్వగా అందులో 47,58,637 తొలి డోసు, మరో 13,91,574 రెండో డోసు టీకాలు పూర్తి చేసింది. ఇక అదే జులై 1వ తేదీ నాటికి ఏకంగా రాష్ట్రంలో 1,14,21,759 కొవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసింది. అందులో 96,34,187 మొదటి డోసులు కాగా .... మరో 16,03,945 రెండో డోస్ టీకాలు ఇచ్చింది. అంటే జూన్ నెలలో మొత్తం 48,75,550 మందికి తొలి డోసు టీకాలు అందించారు. ఇక 2,12,371 రెండో డోసు టీకాలు అందించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో కలిపి సుమారు 1,100లకు పైగా కేంద్రాల్లో టీకా అందిస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉండగా.. ప్రైవేటులో స్పుత్నిక్-వి సైతం ఇస్తున్నారు. ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఉచితంగా టీకాలు అందిస్తున్న సర్కారు కావాలనుకున్న వారు... ఆర్థికంగా స్తోమత ఉన్నవారు ప్రైవేటులో కేంద్రం నిర్ణయించిన ధరలకు టీకా పొందవచ్చని స్పష్టం చేస్తోంది.
రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ ఇవ్వటం వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని భావిస్తున్న సర్కారు అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ తీసుకోవాలని కోరుతోంది. ఫలితంగా మహరమ్మారి కట్టడిలో భాగస్వాములై కుటుంబాన్ని, సమాజాన్ని రక్షించుకోవచ్చని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సూచిస్తోంది.
ఇదీ చూడండి: శరవేగంగా వ్యాక్సినేషన్.. 24 గంటల్లో 1,84,222 మందికి!