ఏపీలోని గుంటూరు జిల్లాలో అధికారుల సమన్వయ లేమితో కరోనా పాజిటివ్ రోగులు ఇబ్బందులు పడ్డారు. సత్తెనపల్లిలో పాజిటివ్ వచ్చిన 30 మందిని కొవిడ్ కేంద్రానికి తరలించాలని అధికారులు నిర్ణయించారు. వారిందరిని ఆర్టీసీ బస్టాండ్‌కు రమ్మని సమాచారం ఇవ్వగా అక్కడికే చేరుకున్న బాధితులు సుమారు 5 గంటలపాటు పడిగాపులు పడ్డారు.
చివరకు కొవిడ్ కేర్ కేంద్రంలో ఖాళీ లేదని.. ఇంటికి వెళ్లి శుక్రవారం ఉదయం రమ్మని అధికారులు సమాచారం ఇచ్చారు. ఇళ్లకు వెళ్తే కుటుంబ సభ్యులకు ఇబ్బందవుతుందని బాధితులు అందోళనకు దిగారు. గంటలపాటు తమను రోడ్డుపై ఉంచడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికు రాత్రి 9.30 గంటల సమయంలో అధికారులు వారిని కాటూరి ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: గోనె సంచిలో మృతదేహం... గుంటూరులో కలకలం