Family Suicide in Kushaiguda: ఆటపాటలతో ఆరోగ్యంగా ఎదగాల్సిన బిడ్డలు మంచానికే పరిమితం కావడంతో ఆ దంపతులు మరణమే శరణ్యమనుకున్నారు. తాము దూరమైతే పిల్లలు అనాథలవుతారని బిడ్డలకు విషమిచ్చి ఆపై దంపతులు తీసుకున్నారు. తీవ్ర విషాదం మిగిల్చిన ఈ ఘటన హైదరాబాద్ కాప్రాలోని కందిగూడలో జరిగింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన గాదె సతీశ్, సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలానికి చెందిన వేదకు 2012లో వివాహం జరిగింది.
వీరికి ఇద్దరు కుమారులు నిషికేత్, నిహాల్. నగరంలోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సతీశ్.. కుటుంబంతో కలిసి కాప్రాలోని కందిగూడలో రెండేళ్లుగా నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు నిహాల్ పుట్టుకతోనే ఆటిజంతో బాధపడుతున్నాడని బంధువులు తెలిపారు. తల్లిదండ్రుల సాయం లేనిదే ఏ పని చేసుకోలేడని బంధువులు వివరించారు. నిహాల్ మానసిక వైకల్యంతో దంపతులిద్దరూ మనస్తాపానికి గురయ్యారు.
Couple With Two Children Committed Suicide in Kushaiguda: కొన్నిరోజుల క్రితం పెద్దకుమారుడు నిషికేత్ కూడా తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. వైద్యులకు చూపించగా మెనింజైటిస్‌తో భాదపడుతున్నారని వెల్లడించారని బంధువులు పేర్కొన్నారు. నిషికేత్‌కు చెవుల నుంచి తరచూ చీము రావడంతో పాటు వినికిడి లోపం ఏర్పడింది. దీంతో దంపతులిద్దరూ తీవ్ర మనోవేదనకు గురయ్యారని బంధువులు వెల్లడించారు.
ఈ క్రమంలో.. నిన్న పిల్లలతో పాటు సతీశ్ దంపతులు విగతజీవులుగా కనిపించారు. ఉదయం సయమంలో సైనేడ్ తీసుకొచ్చిన సతీశ్.. మధ్యాహ్నం పిల్లలు, భార్యకు ఇచ్చాడు. వారు ముగ్గురూ చనిపోయారని ధ్రువీకరించుకున్నాక తను కూడా సైనేడ్ తీసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. మధ్యాహ్నం తర్వాత కుటుంబ సభ్యులు, తెలిసిన వ్యక్తులు సతీశ్, వేదకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదు.
అనుమానం వచ్చి ఇంటికొచ్చి చూడగా ఇద్దరు పిల్లలతో పాటు వేద పడగ గదిలోని మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారని, సతీశ్ పక్క గదిలో కుప్పకూలిపోయినట్లు కనిపించాడని పోలీసులు తెలిపారు. మృతదేహాలను శవపరీక్ష కోసం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఇవాళ శవపరీక్ష అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
ఆత్మహత్య చేసుకున్న గదిలో ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మా నలుగురిని కాపాడాలని ప్రయత్నించొద్దని.. మా అందరినీ ప్రశాంతంగా చనిపోవ్వండి అంటూ లేఖలో ఉందని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య కోసం సైనేడ్ తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సైనేడ్ సతీశ్ చేతికి ఎలా వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: