పుడమితల్లిని నమ్ముకుని.. అందరికీ అన్నం అందించేందుకు ఆరుగాలం కష్టపడుతున్న రైతులకు చివరికి ఏమీ మిగలడం లేదు. సాగు ఖర్చులు ఏటేటా పెరుగుతుండటంతో.. రాబడి గగనంగా మారుతోంది. ప్రకృతి విపత్తులు, తెగుళ్లతో పంట దిగుబడి తగ్గిపోతుండటంతో.. ఒకవేళ మార్కెట్లో ధర బాగున్నా వచ్చే ఆదాయం పెట్టుబడికే సరిపోతోందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాసంగి (రబీ) పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
వరి నాట్లు జోరుగా వేస్తున్నారు. మరోవైపు వానాకాలంలో పండించిన ధాన్యం, పత్తి తదితర పంటలను రైతులు మార్కెట్లకు తీసుకెళ్లి అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో సాగుకు ఎంత ఖర్చవుతోంది, పంటలు అమ్మితే చేతికి ఎంత తిరిగొస్తోందనే అంశంపై పలు జిల్లాల రైతులను ‘ఈనాడు’ పలకరించగా.. పెట్టుబడీ తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వానాకాలంలో అధిక వర్షాలు, తెగుళ్లతో పత్తి, వరి దిగుబడులు తగ్గాయి.
పంటలను వ్యాపారులు మద్దతు ధరకు కొంటున్నా దిగుబడి పెద్దగా రాకపోవడంతో నష్టాలే మిగులుతున్నాయని పలువురు రైతులు తెలిపారు. దిగుబడి ఎక్కువగా రానందువల్లే మద్దతు ధర ఇస్తున్నారని వారు చెబుతున్నారు. రాష్ట్రంలో గత వానాకాలంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. యాసంగిలో 43 లక్షల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా. నాట్లు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. డీజిల్, కూలి రేట్లు, పురుగుమందుల ధరలు పెరిగాయి.
దీంతో గతేడాది యాసంగితో పోలిస్తే పెట్టుబడి మరింత పెరుగుతోంది. జిల్లాలను బట్టి నాట్లు వేసే సమయానికే ఎకరాకు రూ.12-14 వేలు పెట్టాల్సి వస్తోంది. గతేడాది రూ.10 వేలే సరిపోయింది. సంకరజాతి వరి విత్తనాలంటూ కొన్ని ప్రైవేటు కంపెనీలు కిలో విత్తనాలను రూ.370కి అమ్ముతున్నాయి. సాధారణ విత్తనాలనూ 10 కిలోల సంచిని రూ.900కి అమ్ముతున్నారు. ఒక్కో కంపెనీ బ్రాండ్ల పేరుతో ధరలను అమాంతం పెంచేశాయి. కలుపు నివారణకు చల్లే రసాయన మందు లీటరు ధర గతేడాది రూ.600 ఉండగా.. ఇప్పుడు రూ.950కి చేరుకుంది. మగ కూలీలకు జనగామ జిల్లా నవాబ్‌పేట ప్రాంతంలో రోజుకు రూ.900 చొప్పున చెల్లిస్తున్నారు. ఇలా ప్రతి పనికి పెట్టే ఖర్చు పెరిగిపోయిందని రైతులు తెలిపారు.
అంచనాలకు, ఖర్చులకు పొంతనేది?: సాగు వ్యయంపై వ్యవసాయశాఖ అంచనాలకు, రైతులు క్షేత్రస్థాయిలో పెడుతున్న ఖర్చులకు పొంతనే ఉండటం లేదు. ఉదాహరణకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎకరానికి అవసరమైన 25 కిలోల వరి విత్తనాలను రూ.900లోపే అమ్ముతుండటంతో దాన్నే విత్తన ఖర్చుగా వ్యవసాయశాఖ లెక్కిస్తోంది. కానీ, పలు ప్రైవేటు కంపెనీలు 10 కిలోల విత్తనాల సంచిని రూ.600 నుంచి 950 దాకా అమ్ముతున్నాయి.
ఇక రసాయన పురుగుమందుల ధరల నియంత్రణ వ్యవసాయశాఖ పరిధిలో లేదు. దీంతో ఎప్పుడు పెరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. డీజిల్ ధరల పెరుగుదల ప్రభావంతోనూ పలు ప్రాంతాల్లో సాగు ఖర్చులు 10 నుంచి 20 శాతం పెరిగాయి. విత్తనాలు వేసే ముందు దుక్కికి ట్రాక్టర్లు మొదలు పంటకోత, మార్కెట్‌కు తరలింపు వరకూ యంత్రాలను వినియోగిస్తున్నారు. డీజిల్ ధరల పెరుగుదల వల్ల వాటి కిరాయిలనూ పెంచేస్తున్నారు.
గత వానాకాలంలో అన్ని పంటలూ కలిపి కోటీ 36 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఇప్పుడు యాసంగిలో మరో అరకోటి కలిపి.. మొత్తం 1.86 కోట్ల ఎకరాల్లో సాగు కానున్నాయి. ఎకరాకు కనీసం రూ.1,000 చొప్పున పెట్టుబడి పెరిగినా రూ.1,860 కోట్లు పెరిగిందని అంచనా అని, వాస్తవంగా ఇంతకన్నా చాలా ఎక్కువే ఉంటుందని సీనియర్ వ్యవసాయాధికారి ఒకరు తెలిపారు.
నాట్లు వేసేసరికే రూ.14 వేల పెట్టుబడి:
ఈ రైతు పేరు మల్లేశం. జనగామ జిల్లా నల్లుట్ల గ్రామ సమీపంలోని తన రెండెకరాల పొలంలో వరి నాట్లు వేయడానికి ట్రాక్టర్‌తో దమ్ము చేయిస్తున్నారు. ఇలా దమ్ము చేయడానికి ఎకరాకు రూ.7,500 చొప్పున కిరాయి చెల్లించినట్లు చెప్పారు. నాట్లు వేయడానికి కూలీలు ఎకరానికి రూ.5 వేలు అడుగుతున్నారు. విత్తనాలు, దుక్కులు, ఎరువులు వంటివన్నీ కలిపితే ఎకరా పొలంలో నాట్లు వేసేసరికే పెట్టుబడి రూ.14 వేలు దాటుతోంది.
ఆ తరవాత కలుపుతీత, పురుగుమందులు, ఎరువులు, పంట కోత, ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకెళ్లేసరికి కౌలు కాకుండానే ఎకరాకు రూ.35 వేల నుంచి 40 వేల వరకు ఖర్చవుతోందని వివరించారు. తెగుళ్లు, విపత్తులు వంటివి వచ్చి దిగుబడి తగ్గితే నష్టమే మిగులుతోందని వాపోయారు. గత వానాకాలంలో రెండు ఎకరాల్లో మక్క పంట సాగు చేశాను. పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరగడంతో మద్దతు ధర వచ్చినా పెద్దగా మిగిలిందేమీ లేదు.
విత్తనాలకు రూ.7 వేలు, దుక్కులకు రూ.12 వేలు, ఎరువులకు రూ.6 వేలు, కలుపు మందులు, కూలీలకు రూ.8 వేలు.. ఇలా మొత్తం రూ.55 వేల దాకా ఖర్చు పెట్టాను. 34 క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చింది. వ్యాపారి క్వింటాలుకు రూ.1,800 చొప్పున రూ.61,200 ఇచ్చాడు. ఆరు నెలలు కష్టపడితే ఎకరానికి రూ.3 వేలు మిగిలితే ఎలా బతకాలి. అన్ని ఖర్చులు పెరుగుతున్నా పంట ధర ఆ స్థాయిలో పెరగడం లేదు. నాకు సొంతంగా 7 ఎకరాలుంది.
మరో 23 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాను. ఎకరానికి రూ.15 వేల దాకా కౌలు చెల్లించాను. ఇది కలిపి ఎకరానికి రూ.57 వేల వరకూ పెట్టుబడి పెడితే చివరికి 8 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. క్వింటాకు రూ.7 వేల చొప్పున ఇచ్చారు. 8 క్వింటాళ్లకు రూ.56 వేలు రాగా.. రూ.వెయ్యి నష్టం మిగిలింది. పత్తి సాగు ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. ఈ ఏడాది అధిక వర్షాలు, తెగుళ్లతో దిగుబడి సరిగా రాకపోవడంతో మద్దతు ధర రూ.6,300 కన్నా ఎక్కువే ఇచ్చినా ఏమీ మిగల్లేదు. సాగు ఖర్చులు బాగా పెరిగిన మాట వాస్తవమే. ఎకరాలో నాట్లు వేయడానికి కూలీలకు రూ. 5వేలు ఖర్చవుతుంది. నాటు యంత్రం ఉంటే రూ.3 వేలలోపే అవుతుంది. గ్రామాల్లో సేవాకేంద్రాలు ఏర్పాటు చేసి.. రైతులకు యంత్రాలు కిరాయికిస్తే సాగు ఖర్చు తగ్గించవచ్చు.
ఇవీ చదవండి: