Land Regularization: ఆక్రమిత ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆధీనంలో ఉన్న భూములపై హక్కులు కాజేసేందుకు కుటిల ప్రయత్నాలు మొదలయ్యాయి. 125 గజాలకు పైగా విస్తీర్ణమున్న భూములను మార్కెట్ మూల ధరను అనుసరించి వివిధ స్థాయుల్లో రుసుం వసూలు చేసి క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయం విదితమే. ఆక్రమణదారులు ఆ భూమి వారి ఆధీనంలోనే ఉందని రుజువు చేసుకునేందుకు 2014 జూన్ రెండో తేదీకి ముందు స్థానిక సంస్థలకు చెల్లించిన నల్లా, విద్యుత్తు, ఆస్తి పన్ను రసీదులను దరఖాస్తులతో జతచేయాలని కూడా సర్కారు పేర్కొంది. దీంతో అక్రమార్కులు పాత రసీదులను సృష్టించేందుకు విశ్రాంత ఉద్యోగులు, వార్డు కౌన్సిలర్లు, కొందరు పంచాయతీల సర్పంచులు, స్థానిక నాయకులతో క్రమబద్ధీకరణ రాయబేరాలు ప్రారంభించినట్లు తెలిసింది.
పాత రసీదులు పొందేందుకు...
సంగారెడ్డి జిల్లాలో ఓ మండలంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారు ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ జిల్లాలోనూ ఆక్రమణలో ఉన్న విస్తీర్ణాలకు హక్కులు పొందే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. 2014-16 మధ్య కాలంలో పూర్తి చేసిన మొదటి దశ క్రమబద్ధీకరణలో దరఖాస్తులు తిరస్కారానికి గురైన వారిలో కొందరు దొడ్డిదారులు వెతికే పనిలో ఉన్నట్లు తెలిసింది. వాస్తవానికి నాటి ప్రక్రియ పూర్తికాగానే కబ్జాదారుల చేతుల్లో మిగిలిపోయిన భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి. కానీ, సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు ఆ భూముల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణాలు చేపడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఒకటి రెండు గదులు నిర్మించి వాటికి నల్లా, పైపులైను వేసి పాత తేదీలతో రసీదులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఇదీ చూడండి: