కొవిడ్ ఆస్పత్రి గాంధీలో 800 మందికి చికిత్స అందించే లక్ష్యంతో పడకలు ఏర్పాటు చేశారు. పూర్తిగా కొవిడ్ ఆస్పత్రిగా మార్చిన తర్వాత.. ఆ మేరకు సదుపాయాలు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జంటనగరాలతోపాటు జిల్లాల నుంచి పరిస్థితి విషమంగా ఉన్న కరోనా బాధితులను ఇక్కడికి తరలిస్తున్నారు. ప్రస్తుతం గాంధీలో దాదాపుగా ఆరు వందల మంది చికిత్స పొందుతున్నారు. వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారే. గత రెండు రోజులుగా నర్సులు, ఇతర పారిశుద్ధ్య కార్మికులు, మెడికల్ సిబ్బంది సమ్మెకు దిగటంతో వారి పరిస్థితి మరింత దిగజారింది. ఆస్పత్రిలో కనీసం ఆక్సిజన్ అయిపోయినా పట్టించుకునే వారు లేక కొందరు ప్రాణాలు కోల్పోయారు. చివరి దశలో కొందరు తమ వారికి వీడియో కాల్స్ చేసి తమ గోడును వెలిబుచ్చారు. మరికొందరు రికార్డు చేసి మిత్రులకు పంపి తమ ప్రాణాలు కాపాడాలంటూ.. వేడుకున్నారు.
అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులు
మరోవైపు జంటనగరాల పరిధిలో రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు పెద్దసంఖ్యలో సాగుతుండటం వల్ల పాజిటివ్ కేసులు కూడా అదేస్థాయిలో వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌లో కేసులు పెరగడం వల్ల వారం పాటు పార్టీ కార్యాలయాన్ని మూసివేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇవాళ కొత్తగా 99 మందికి కరోనా నిర్థారణ అయింది. యూసుఫ్‌గూడలో 48, బోరబండలో 19, ఎర్రగడ్డలో 13, రహ్మత్ నగర్లో 10 మందికి, వెంగళ్రావు నగర్లో 8 మందికి కరోనా సోకింది. పాతబస్తీలోని చార్మినార్‌లో పది, ఫలక్‌నుమాలో 10 పాజిటివ్ కేసులు వచ్చాయి. కాప్రాలో 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గచ్చిబౌలి కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో 35 పాజిటివ్ కేసులు వచ్చాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కొత్తగా 65 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మీర్పేట్ కార్పొరేషన్లో 20 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మల్కాజిగిరిలోని కేంద్ర ఆసుపత్రిలో 60 మందికి కరోనా సోకింది. సికింద్రాబాద్ నార్త్‌జోన్ పరిధిలో 55 మందికి పాజిటివ్ సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. అంబర్పేట్ నియోజకవర్గంలో 25 మందికి కరోనా సోకింది.
ఇవీ చూడండి: గాంధీభవన్‌కు కరోనా సెగ.. వారం రోజులు కార్యాలయం బంద్