ఓవైపు ఇంటింటి జ్వరసర్వేను కొనసాగిస్తూనే మరోవైపు నిర్ధరణ పరీక్షలు పెంచుతూ కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహం అమలు చేయాలని అధికారులను ముఖ్యమత్రి కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు. నిబంధనల పేరిట ఎవరికీ కరోనా పరీక్షలు నిరాకరించవద్దని స్పష్టం చేశారు. రేపట్నుంచే ర్యాపిడ్ యాంటీజెన్ కిట్ల సంఖ్యను పెంచాలని తెలిపారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణా చర్యలు, లాక్ డౌన్ అమలు, బ్లాక్ ఫంగస్‌కు చికిత్స, టీకాలు, సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం పడకలు పెంచాలని, అవసరమైన ఔషధాలు సమకూర్చుకోవాలని కేసీఆర్ తెలిపారు. రెండో డోసు అవసరమైన వారి కోసం తగిన టీకాలు సమకూర్చుకోవాలని చెప్పారు. దిల్లీ, మహారాష్ట్రలో కట్టడి చర్యలను అధ్యయనం చేయాలని... అవసరమైతే దిల్లీ వెళ్లి రావాలని వైద్యాధికారులను సీఎం ఆదేశించారు. కరోనా నియంత్రణ కోసం ఎంత ఖర్చుకైనా ప్రభుత్వం వెనకాడబోదని... మొత్తం వ్యవస్థ దీనావస్థలో, భయానకంగా ఉన్న ప్రస్తుత స్థితిలో అందరూ మానవతా ధృక్పథంతో స్పందించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు..
ఇదీ చదవండి: 'ఆనందయ్య ఔషధంపై 5 రోజుల్లో తుది నివేదిక'