నగరంలో నెల రోజుల క్రితం వరకు కరోనా పరీక్ష కేంద్రాలు ఖాళీగా కనిపించేవి. అనుమానితులు చాలా తక్కువ మంది వచ్చేవారు. కొన్ని కేంద్రాల్లో ఒక్కో రోజు పది మందికి మించేవారు కాదు. గత పక్షం రోజులుగా కొవిడ్-19 వైరస్ విజృంభిస్తోంది. నెల రోజుల కిందట నగరంలో రోజూ 30 కేసులు వస్తే, గురువారం ఏకంగా 200కు పైగా కేసులు నమోదయ్యాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు తదితర లక్షణాలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల వరకు ఈ లక్షణాలున్నా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు పరీక్ష కేంద్రాలకు పరుగులు తీస్తుండడంతో ఉదయం 8 గంటలకే కిక్కిరిసిపోతున్నాయి.
జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాలు
- హైదరాబాద్ 33
- రంగారెడ్డి20
- మేడ్చల్ 23
ఉదయం 11.30 తర్వాతే...
కరోనా పరీక్ష కేంద్రాల సిబ్బంది ఉదయం పది గంటలకు వస్తున్నారు. అనుమానితుల ఆధార్, ఫోన్ నంబర్లు తీసుకుని దీన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి కనీసం గంటన్నర సమయం పడుతోంది. 11.30 తరవాతే నమూనాలు సేకరించి, మధ్యాహ్నం 2 గంటలకు వరకు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు వెళ్లిన అనుమానితుడు మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల వరకు ఎండలోనే నిరీక్షించాల్సి వస్తోంది. కొన్ని కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవు.
● రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పరీక్ష కేంద్రాలను గురువారం ‘ఈనాడు’ పరిశీలించింది. మైలార్‌దేవ్‌పల్లి, శివరాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హసన్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో కనీస సౌకర్యలు లేవు. హసన్‌నగర్ కేంద్రం చిన్న గల్లీలో ఉంది. కనీసం షెల్టర్ లేదు. పదిమంది నిల్చోవడానికి వీల్లేని పరిస్థితి.
● నలుగురైదుగురు సిబ్బది ఉంటే పరీక్షలు వేగంగా జరిగే అవకాశం ఉంది. చాలా చోట్ల ఇద్దరికి మించి ఉండటం లేదు. మధ్యాహ్నం 12 తరువాత వచ్చిన వారిని తిప్పి పంపిస్తున్నారు.
- వెంటనే ఫలితం చెబుతున్నారా అంటే అదీ లేదు. ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితం రెండు రోజుల్లో, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష అదే రోజు మధ్యాహ్నం చెప్పాలి. అత్తాపూర్ సోమిరెడ్డినగర్‌కు చెందిన ముగ్గురు అనుమానితులు గురువారం శివరాంపల్లి కేంద్రంలో ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష చేయించుకున్నారు. రాత్రికి కూడా చరవాణికి ఫలితం రాలేదు.
- ఆదివారం సాధారణ సెలవు, సోమవారం హోలీ కావడంతో రెండు రోజులు పరీక్షలు నిర్వహించలేదు. ప్రైవేటు కేంద్రాలకు వెళ్లే స్థోమత లేని వారు ఇళ్లలో వేచి ఉండి మూడో రోజూ కేంద్రాలకు వచ్చారు. దీంతో కుటుంబంలో ఇతరులకు వైరస్ వ్యాప్తి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సెలవు రోజూ పరీక్షలు చేయాలని, టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రాజధానితోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఈ ఆదేశాలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: 'కరోనా టీకా తీసుకున్నవారిలో 10 నెలలు వరకు యాంటీబాడీలు'