హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని బస్తీల్లో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వలస కూలీలకు స్టాంప్ వేశారు. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి నగరానికి వచ్చిన వలస వాసులకు బల్దియా తరఫున ఇంటింటికి వెళ్లి స్టాంప్ వేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సర్కిల్ 14 పరిధి బస్తీల్లో స్టాంప్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ నాగమణి బెస్త తెలిపారు.
నగరంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావటం వల్ల ప్రజలందరూ భౌతిక దూరం పాటించడం నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని అధికారులు సూచించారు. మహిళలు, చిన్నారులు పౌష్టికాహారం ద్వారా రోగనిరోధక శక్తి పెంచుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు రీటా, కళావతి తదితరులు పాల్గొన్నారు.