భాగ్యనగరంలో గురువారం కరోనా పాజిటివ్ కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. పహాడిషరీఫ్ మాంసం దుకాణం యజమాని ఇచ్చిన విందుతో సంబంధం ఉన్న వారిలో మరో ఎనిమిది మందికి కరోనా నిర్ధరణ అయింది. అంతకు ముందే వారి కుటుంబంలో 14 మందికి కరోనా సోకగా వారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి సంబంధీకులలో మరికొందరికి కూడా కరోనా సోకినట్టు అనుమానిస్తున్న అధికారులు వారి కోసం ఆరా తీస్తున్నారు. కూకట్పల్లి డివిజన్లోని హనుమాన్‌నగర్‌లో 22 ఏళ్ల యువకుడికి కరోనా సోకగా గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులను కూడా అధికారులు క్వారంటైన్‌కు పంపించారు.
ఐదుగురు పోలీసులకు..
అంబర్పేట్ పరిధిలో గురువారం ఒక్కరోజే ఏడుగురికి కరోనా పాజిటివ్ తేలగా.. వారిలో ఐదుగురు పోలీస్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వారిలో ఒకరు ఇంటిలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. వారు చెన్నారెడ్డి నగర్, బాగ్అంబర్ పేట్, కాచిగూడ, నారాయణగూడ, గోల్నాక శంకర్‌నగర్‌కు చెందినవారిగా గుర్తించారు. గాంధీలో సెక్యూరిటీ వింగ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సోకింది. అతను హబ్సిగూడ డివిజన్లోని వెంకటరెడ్డి నగర్‌లో నివాసం ఉంటున్నారు. ముషీరాబాద్‌లోని బోలక్‌పూర్‌లో కొత్తగా ఆరుగురికి కొవిడ్ వచ్చింది. వీరిలో ఒకే ఇంటికి చెందిన ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. వారు మహారాష్ట్రలోని జియాగూడకు ఇటీవల వెళ్లి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
బ్యాంక్‌లో పనిచేస్తున్న వారికి..
అల్వాల్‌లో గురువారం ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. వీరిలో ఒకరు వెస్ట్ వెంకటాపురం బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. మరొకరు మచ్చబొల్లారంలో నివాసం ఉంటున్న పోలీస్ కానిస్టేబుల్‌గా గుర్తించారు. ఈ తరుణంలో కానిస్టేబుల్ కుటుంబాన్ని క్వారంటైన్‌కు తరలించారు. ఎన్టీఆర్నగర్లో కరోనా పెరగటం వల్ల మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఆ ప్రాంతంలో పర్యటించి స్థానికులకు ధైర్యం చెప్పారు. అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. రంగారెడ్డి జిల్లా అజీజ్‌నగర్‌కు చెందిన వాటర్ డిపార్టుమెంట్లో పనిచేస్తోన్న 49 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా లక్షణాలతో ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా ఆ తరువాత వారు ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి : పోలీస్ శాఖలో పెరుగుతున్న కరోనా బాధితులు