భాగ్యనగరంలో కరోనా వైరస్ వ్యాప్తి నానాటికీ విస్తరిస్తోంది. ప్రజలు పూర్తిస్థాయిలో రోడ్లపైకి రావటం, కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరటం వల్ల కొత్తగా నమోదవుతోన్న కేసుల ట్రాక్‌ను కనిపెట్టడం కూడా అధికారులకు తలనొప్పిగా మారుతోంది.
గడిచిన వారం రోజుల్లోనే గ్రేటర్ పరిధిలో 612 కేసులు నమోదు కావడం అటు అధికారులను, ఇటు ప్రజలను కలవర పెడుతోంది. శుక్రవారం కూడా వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు కరోనా బారిన పడ్డారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రుల్లోని వైద్యులు, ఇతర సిబ్బంది, పీజీ మెడికల్ విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించటంతో పాటు వారిని అప్రమత్తం చేశారు. ఆయా ఆసుపత్రులతో పాటు...ఇతర ప్రైవేటు ఆసుపత్రుల ఓపీ సేవల కోసం వస్తున్న బాధితులతో పాటు.... వైద్యులు భయాందోళనకు గురవుతున్నారు.
క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందిని వైరస్ వదలడం లేదు. ఇప్పటికే అనేక మంది వైరస్ బారిన పడగా.... శుక్రవారం మరికొంత మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ జరిగింది. పరిస్థితి చేయిదాటి పోతున్నందున ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న వైరస్ బారిన పడే అవకాశం ఉందని ఆయా విభాగాల అధికారులు మరోసారి ప్రజలను హెచ్చరించారు.
సికింద్రాబాద్ జోన్లో కరోనా కేసుల అధికంగా నమోదవుతున్నాయి. అలాగే అంబర్‌పేట పరిధిలోనే 118కు పైగా కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఖైరతాబాద్ జోన్‌లోని జియాగూడలో అధికంగా 150 మందికి కరోనా సోకడం వల్ల ఆయా ప్రాంతాలపై బల్దియా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం రసాయనాల పిచికారీతో పాటు.... ఇంటింటికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
143 కంటైన్మెంట్ క్లస్టర్స్ ఏర్పాటు...
గ్రేటర్ పరిధిలో మొత్తం 143 కంటైన్మెంట్ క్లస్టర్స్ ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్ జోన్లో 21 , కూకట్ పల్లి జోన్లో 10, చార్మినార్ జోన్లో 28, ఖైరతాబాద్ జోన్లో 35, శేరిలింగంపల్లి జోన్లో 16, సికింద్రాబాద్ జోన్లో 33 కంటైన్మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేశారు.
శుక్రవారం నగరంలో అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. వెంగళ్రావు నగర్ డివిజన్లోని జవహర్ నగర్లో 47 ఏళ్ల ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చార్మినార్‌లో మరో పోలీస్ కానిస్టేబుల్‌కు కరోనా సోకింది. నిమ్స్‌లో ఓ మహిళా వైద్యురాలికి, మరో మహిళా ఉద్యోగికి పాజిటివ్ నిర్ధరణ అయినట్లు అధికారులు వెల్లడించారు.
ఇద్దరు చిన్నారులకు కరోనా పాజిటివ్...
ముషీరాబాద్ నియోజకవర్గంలో ఓ కుటుంబంలో ఇద్దరు చిన్నారులతో పాటు భార్యాభర్తలకు కరోనా సోకింది. ఇక్కడే ఒక ఎయిర్ హోస్టెస్, మరో వృద్ధుడు కరోనా బారిన పడినట్లు అధికారులు చెప్పారు. కూకట్ పల్లి సర్కిల్లో విద్యుత్ బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తిగా కరోనా నిర్ధరణ అయింది. ఓల్డ్ బోయిన్పల్లి మల్కాజిగిరి కాలనీకి చెందిన ఒక వృద్ధునికి కరోనా వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.
శుక్రవారం ఫీవర్ ఆసుపత్రిలో 45 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మీడియా నుంచి 13 మందితో పాటు... పలు కాలనీల నుంచి వచ్చిన 32 మందికి పరీక్షలు నిర్వహించారు. గురువారం నిర్వహించిన 20 పరీక్షల్లో నాలుగు పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
గాంధీలో వృద్ధురాలులు మృతి...
కాచిగూడలో పరిధిలోని నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యునికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. గాంధీలో కరోనా చికిత్స పోందుతూ కాచిగూడలోని కృష్ణనగర్‌కు చెందిన వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. నెహ్రునగర్‌లోని 54 ఏళ్ల మహిళకి పాజిటివ్ నిర్ధరణ అయింది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బాగ్ అంబర్ పేటకు చెందిన యువకునికి కరోనా సోకింది.