కరోనా (Corona) మహమ్మారి కుటుంబాలను చిదిమేస్తోంది.. బంధాలను తుంచేస్తోంది.. రక్తబంధాలను తెంచేస్తోంది.. ఒక విషాదాన్ని మరిచిపోయేలోపే మరో పెనువిషాదం.. ఒకరిని కాటికి సాగనంపి వచ్చేలోపే మరోసారి మృత్యుదేవత తలుపు తట్టడం. మరొకరిని వెంటపెట్టుకునిపోవడం! పగవాళ్లకు కూడా రావద్దని కోరుకునే కొండంత కష్టమిది! మొన్నటివరకు అన్యోన్యంగా గడిపిన ఓ పెద్ద కుటుంబాన్ని (Big Family) ఈ మహమ్మారి కన్నీటి సంద్రంలో ముంచింది.
చికిత్సకే రూ. కోటి...
వారంతా ఏడుగురు అన్నదమ్ములు, ఇద్దరు ఆడబిడ్డలు.. వారి పిల్లలు, బంధువులతో కలిపి 252 మంది ఉన్న ‘జగమంత కుటుంబం’. గత ఐదు నెలల్లో ఒకరి తరువాత ఒకరుగా 89 మంది కొవిడ్ బారినపడగా 18 మంది చనిపోయారు. ఒకరో ఇద్దరికో కొవిడ్ సోకగానే చికిత్సకు ఏర్పాట్లు, ఆసుపత్రి కోసం వెతుకులాడుతుండగానే మరో ఫోన్ వచ్చేది.. ఫలానా ఊళ్లో ఫలానా కుటుంబంలో కరోనా కాలుపెట్టిందనే విషయం తెలిసేది. వారి కోసం ఏర్పాట్లు పూర్తయ్యేలోపు మరొకరి బాధ్యత మీదపడేది. వీరందరికీ క్వారంటైన్ ఏర్పాట్లు.. చికిత్సకు ఖర్చుల కోసం వెతుకులాట.. సర్దుబాట్లు.. ఇంతమందికి ఆసుపత్రి ఖర్చులు దాదాపు కోటి రూపాయలపైనే కావడం గమనార్హం.
తీరని వేదన...
ఇంత చేసినా కొందరిని పోగొట్టుకుని తీరని వేదన. చిత్తనూరి పాండురంగయ్య, ఈశ్వరయ్య, శంకరయ్య, సుధాకర్ (రాధ), ప్రకాశ్, పరమేశ్వర్, అశోక్‌కుమార్, లక్ష్మి, మరో సోదరి కుటుంబాలు ఉద్యోగ, వ్యాపార బాధ్యతల రీత్యా హైదరాబాద్, కల్వకుర్తి, జడ్చర్ల ప్రాంతాల్లో నివసిస్తున్నాయి. వేర్వేరు ఊళ్లలో ఉంటున్నా తరచూ వారంతా ఏదో ఒక సందర్భంలో కలుసుకునేవారు.. అంతా తలాకాస్తా వేసుకుని 18 ఏళ్లపాటు ఓ అనాథాశ్రమాన్ని నిర్వహించారంటే ఆ కుటుంబాల మధ్య అనుబంధం అర్థమవుతుంది.
ఒకరి వెంట మరొకరు..
ఒకరి తర్వాత ఒకరు చొప్పున 12 మంది చిన్నారులు సహా 89 మంది కొవిడ్ బారినపడ్డారు. ఆసుపత్రుల్లో చేరి చాలామంది స్వస్థత పొందగా 18 మంది మాత్రం కోలుకోలేకపోయారు. హైదరాబాద్‌లో ఉంటున్న విశ్రాంత ఉద్యోగి పాండురంగయ్య కుటుంబంలో నలుగురికి పాజిటివ్ రాగా ఆయన కోడలి కుటుంబ సభ్యులు ఇద్దరు కన్నుమూశారు. జడ్చర్లలో ఉండే ఈశ్వరయ్య కుటుంబంలో 9 మందికి కొవిడ్ సోకింది. అలాగే విశ్రాంత ఉద్యోగి శంకరయ్య భార్య కుటుంబంలో రవితోపాటు మరొకరు మృతిచెందారు.
సుధాకర్ కుటుంబంలో 13 మందికి కరోనా రాగా ముగ్గురు చనిపోయారు. కల్వకుర్తి వద్ద పల్లెలో నివసించే ప్రకాశ్ కుటుంబంలో 11 మందికి పాజిటివ్ వచ్చింది. ఆయన భార్య మేనత్త నర్సమ్మ, కుటుంబసభ్యులు ఆండాళ్లు, ఆమె భర్త, రాజు, మరో వ్యక్తి మృతిచెందారు. జడ్చర్లలో వ్యాపారం చేసే పరమేశ్వర్ కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్‌లో పర్యవేక్షక ఇంజినీర్‌గా పనిచేస్తున్న అశోక్‌కుమార్ కుటుంబంలో 16 మందికి పాజిటివ్ వచ్చింది. ఆయన భార్య తరఫు బంధువులు వాసు, జనార్దన్, హరిణి, జ్యోతి, ఇద్దరు కన్నుమూశారు. ఆమె మేనమామ కుటుంబ సభ్యులు 10 మందికి కరోనా సోకింది. ఆడపడుచు లక్ష్మి కుటుంబంలో నలుగురికి కరోనా రాగా ఇద్దరు మృత్యువాత పడ్డారు.
బంధాలను కదలించిన కరోనా
- అశోక్‌కుమార్, పర్యవేక్షక ఇంజినీరు, హైదరాబాద్మా కుటుంబాలే మాకు బలం. ఏ సందర్భం వచ్చినా కలిసే జరుపుకొంటాం. ఈ ఐదు నెలల్లో 18 మందిని కోల్పోవడం చాలా బాధ కలిగిస్తోంది.
ఇదీ చదవండి: 'కరోనా ఫ్రీ' గ్రామం.. రూ.50 లక్షల పురస్కారం