కొవిడ్ మహమ్మారి రాష్ట్రంలో క్రమంగా విజృంభిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను కరోనా వెంటాడుతోంది. నిర్మల్ జిల్లాలో శనివారం నిర్వహించిన పరీక్షల్లోనే 536 మందికి పాజిటివ్ రావడం కలకలం రేకెత్తిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం వచ్చిన 336 పాజిటివ్ కేసులను పరిగణలోకి తీసుకుంటే యాక్టివ్ కేసుల సంఖ్య 1505కి చేరగా మరణాలు సంఖ్య 53కు చేరుకుంది. మంచిర్యాల జిల్లాలో 229 పాజిటివ్ కేసులు రాగా కుమురంభీం జిల్లాలో వ్యాధిగ్రస్థుల సంఖ్య 850 దాటింది. అధికారులు.. వ్యాపార, వాణిజ్యవర్గాలతోపాటు విడివిడిగా సమావేశాలు నిర్వహించి కొవిడ్ నిబంధనలపై దిశానిర్దేశం చేస్తున్నారు.
కొవిడ్ నిబంధనలపై సమీక్ష
నిజామాబాద్ నగరంలోని వివిధ వాణిజ్య వ్యాపార సముదాయాల యాజమాన్యాలతో... డిప్యూటీ పోలీసు కమిషనర్ అరవింద్ బాబు కొవిడ్ నిబంధనలపై సమీక్ష నిర్వహించారు. ప్రతి యజమాని తమ వినియోగదారులు మాస్కు ధరించి వస్తేనే అనుమతించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ బస్టాండ్‌లో... ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందికి కరోనాపై పోలీసులు అవగాహన కల్పించారు.
బేగంబజార్‌లో అవగాహన ర్యాలీ
హైదరాబాద్ కూకట్‌పల్లి నిజాంపేట చౌరాస్తాలో జయభారత్ లయన్స్ సభ్యులతో కలిసి.. కె.పి.హెచ్.బి పోలీసులు అవగాహన కార్యక్రమం చేపట్టారు. మాస్కులు ధరించని వారికి ఉచితంగా మాస్కులు అందజేసి... మాస్కులు ధరించాల్సిన ఆవశ్యకత తెలియజేశారు. బేగంబజార్‌లోని అన్ని దుకాణాల వద్ద పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. వికారాబాద్ జిల్లా తాండూరుకి చెందిన మహమ్మద్ అలీ... పట్టణంలో రోడ్లు మీదుగా తిరుగుతూ.. మహమ్మారిపై అవగాహన కల్పిస్తున్నారు.
17 మందికి కరోనా
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారంకి చెందిన 17 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి... మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో మాస్క్ ధరించాలంటూ... పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ప్రతి దుకాణ సముదాయం ముందు బ్యానర్‌లను ఏర్పాటు చేశారు.
14 మందికి కొవిడ్ పాజిటివ్
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలో 14 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మోత్కూరు పట్టణంలోనే 11 కేసులు వెలుగుచూశాయి. ఆలేరులో పలు ప్రైవేటు కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా.. భౌతికంగా తరగతులు నిర్వహించటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో.. తరగతులు నిర్వహిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని.. స్థానికంగా డిమాండ్ వ్యక్తం అవుతోంది.
ఇదీ చదవండి: ఫూలే ఆలోచనా విధానాన్నే ప్రభుత్వం అమలుచేస్తోంది: కేసీఆర్