గ్రేటర్ హైదరాబాద్‌లో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 463 మందిని కొవిడ్-19 పాజిటివ్‌లుగా అధికారులు నిర్ధరించారు. వీటితో కలిపి నగరంలో ఇప్పటి వరకు మొత్తం 42,652 కేసులు నమోదయ్యాయి.
మేడ్చల్ జిల్లాలో 141, రంగారెడ్డి జిల్లాలో 139 కొత్త కేసులు నమోదయ్యాయి. మలక్‌పేట మార్కెట్ పరిసరాల్లో గతంలో కరోనా కల్లోలం సృష్టించగా.. తాజాగా మరో 6 కేసులు వెలుగుచూడడంతో అక్కడి యంత్రాంగం అప్రమత్తమైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 77 ప్రాంతాలను ప్రభుత్వం కంటెయిన్‌మెంట్ జోన్లుగా ప్రకటించగా.. అందులో 32 చార్మినార్ జోన్‌లోనే ఉండడం గమనార్హం. ఖైరతాబాద్‌లో 14, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్ జోన్లలో 10 చొప్పున, కూకట్‌పల్లి జోన్‌లో 7 కంటెయిన్‌మెంట్ జోన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ జోన్లన్నీ రికార్డుల్లోనే కన్పిస్తున్నాయి కానీ.. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి కట్టడి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. అక్కడ వ్యాపారాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వివిధ పనులపై ఆయా ప్రాంతాలకు వెళుతూనే ఉన్నారు. ఆయా జోన్లలో రాకపోకలను నిషేధించడానికి గతంలో మాదిరిగా అధికారులు కానీ పోలీసులు గానీ ఉండడంలేదు. అందువల్ల ఇతరులకు కరోనా సోకే ప్రమాదాలున్నాయన్న ఆందోళన నెలకొంటోంది.
యువతను పట్టి పీడిస్తున్న మహమ్మారి
మొత్తం కరోనా కేసుల్లో 31 నుంచి 40 ఏళ్ల మధ్య వయసువారే 25 శాతం మంది ఉన్నారు. కేవలం నిర్లక్ష్యం కారణంగానే వీరు వైరస్ బారినపడుతున్నారు. ఈ 25 శాతం మందిలో పురుషులే 17.7 శాతం ఉండడం ఇందుకు నిదర్శనం. హైదరాబాద్‌లో ఈనెల 4వ తేదీ నుంచి రోజూ 500 కేసులు తగ్గకుండా నమోదవుతుండడం.. ఆందోళన రేపుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. మేడ్చల్‌లో ఈనెల 2న 48 కేసులు నమోదవగా.. మరుసటి రోజు 72, ఆ తర్వాత శనివారం వరకూ రోజు వంద కేసులకు తగ్గకుండా నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో ఈనెల 2న 73 కేసులు నమోదు కాగా.. తర్వాత 8వ తేదీ వరకూ ఏనాడు వందకు తగ్గలేదు.
ఇదీ చూడండి : షేక్‌పేట్ తహసీల్దార్, ఆర్‌ఐను అనిశాకు పట్టించిన వ్యక్తి అరెస్టు