సుదీర్ఘ సాగరతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా.. సముద్ర రవాణాకు అనుకూలమైన ఖిల్లా.. ఇక్కడి తీరంలో రెండు పోర్టులు ఉన్నాయి. కాకినాడ యాంకరేజి పోర్టు ఆంధ్రప్రదేశ్ పోర్టుల శాఖ పర్యవేక్షణలో నడుస్తుంటే.. కాకినాడ డీప్ వాటర్ పోర్టు (కాకినాడ సీ పోర్టు) ప్రైవేటు యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తోంది. జిల్లా నుంచి ఏటా రూ.వందల కోట్ల విలువైన సరకు ఎగుమతులు, దిగుమతులు సాగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా ఆదాయం సమకూరుతుందని భావించిన యాజమాన్యాలకు కరోనా కొంత నిరుత్సాహాన్నే మిగిల్చింది. గతేడాదితో పోలిస్తే ఆదాయ వృద్ధి మెరుగ్గా ఉన్నా.. ఆశించిన రీతిలో లేదనే నిరాశ కనిపిస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం సముద్ర మార్గంలో సరకు రవాణాపైనా పడటంతోనే ఈ పరిస్థితి ఎదురైంది.
జిల్లాలో కీలకమైన రెండు పోర్టుల్లో ప్రభుత్వ అధీనంలోని కాకినాడ యాంకరేజి పోర్టు నుంచి బియ్యం దక్షిణాఫ్రికా దేశాలకు.. సిమెంటు పోర్టు బ్లెయిర్, అండమాన్‌కు ఎగుమతి చేస్తుంటారు. కాకినాడ సీ పోర్టు నుంచి గ్రానైట్ బ్లాకులు, సిమెంటు, పంచదార, లాటరైట్ తదితర నిల్వలు విదేశాలకు ఎగుమతి అవుతాయి. బొగ్గు, ఎరువులు, అల్యూమినియం, పాస్పరిక్ యాసిడ్, ఎడిబుల్ ఆయిల్ తదితరాలు దిగుమతి అవుతుంటాయి. ఈ ప్రైవేటు పోర్టు ఆదాయం 2019-20లో రూ.534 కోట్లు ఉంటే.. ఇందులో ప్రభుత్వ వాటా రూ.117.3 కోట్లు ఉండటం గమనార్హం.
20 రోజులు స్తంభించాయ్..
కరోనా లాక్‌డౌన్ ప్రభావంతో కాకినాడ యాంకరేజి పోర్టులో ఈ ఏడాది మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు సేవలు పూర్తిగా స్తంభించాయి. పోర్టు అత్యవసర కేటగిరీలో ఉన్నా.. కూలీలు రాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ కాలంలో లక్ష మెట్రిక్ టన్నుల సరకు ఎగుమతులకు విఘాతం కలిగింది. దీంతో రూ.కోటిన్నర వరకు ఆదాయానికి గండి పడింది. తాజాగా జిల్లా కేంద్రం కాకినాడలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత పెరిగింది. పీడితుల్లో అన్నివర్గాల శ్రామికులూ ఉన్నారు. దీంతో సావ΄హిక పనులకు కూలీలు వెనకాడుతున్నారు. వెరసి లోడింగు పనులు నెమ్మదించాయి. ఎంతలా అంటే... జూన్‌తో పోలిస్తే జులై, ఆగస్టులో లక్ష మెట్రిక్ టన్నుల ఎగుమతికి అవరోధం ఏర్పడింది.
అరకొరగా పనులకు..
కాకినాడ యాంకరేజి పోర్టులో 10 వేల మంది కార్మికులు పని చేయాల్సి ఉంటే.. ప్రస్తుతం విధులకు 3 వేల మంది మాత్రమే హాజరవుతున్నారు. ఈ పోర్టులో 89 స్టీల్ బార్జిలు ఉన్నాయి. ఒక్కో బార్జి మీద 16 నుంచి 24 మంది వరకు పనిచేస్తారు. సరకు లోడుతో ఉన్న ఈ బార్జిలను లాగడానికి నిర్దేశించిన టవ్వింగ్ బోట్లలో ఆరు నుంచి ఎనిమిది మంది వరకు కార్మికులు అవసరం. స్వీవ్ డోర్ లేబర్‌దీ కీలక పాత్రే. కూలీల కొరత కారణంగా ఈ పనులు సవ్యంగా సాగడంలేదు. ఈ ప్రభావం ఎగుమతులపై పడుతోంది.
రూ.100 కోట్లతో దూకుడు పెంచేలా..
జిల్లాలో ప్రైవేటు పోర్టుతో పోలిస్తే ఆదాయంలో ప్రభుత్వ పర్యవేక్షణలోని పోర్టు వెనుకబడే ఉంది. ఈ క్రమంలో సమర్థ సేవలకు యాంకరేజి పోర్టులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సన్నాహాలు చేస్తున్నారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా రూ.100 కోట్ల నిధులతో నూతన వార్ఫ్ వాల్ నిర్మాణం, జగన్నాథపురం నుంచి సముద్రం మొగ వరకు 5 కి.మీ పొడవు ఉన్న కాలువ డ్రెడ్జింగ్ పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న కాలువలో 2.5 మీటర్ల లోతున పూడిక తీయడానికి ప్రణాళికలు రూపొందించారు. సరకులు బార్జిల్లోకి ఎత్తే లోడింగ్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధిపైగా దృష్టిసారించారు. వేగంగా సరకు రవాణాలో భాగంగా రహదారులు, గోదాములను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర పథక నివేదిక (డీపీఆర్) సిద్ధంచేస్తున్నారు.
కరోనా లేకుంటే.. ఆదాయం బాగా పెరిగేది
కాకినాడ యాంకరేజి పోర్టు ఆదాయం గత ఏడాది కంటే బాగుంది. నాలుగు నెలలకే ఆదాయం బాగా వచ్చింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా కొద్దిరోజులు ఎగుమతులు నిలిచిపోవడం.. కేసుల తీవ్రత కారణంగా పది వేల మందికి కేవలం 3 వేల మంది వరకు మాత్రమే కూలీలు వస్తుండడంతో సమస్య ఎదురవుతోంది. కరోనా ఇబ్బంది లేకపోతే ఆదాయం మరింత పెరిగేది. కాకినాడలో కరోనా కేసులు ఎక్కువ కావడంతో ఈమధ్య లోడింగ్‌పై ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
- జి.వి.రాఘవరావు, పోర్టు అధికారి
ఇదీ చదవండి: 21నెలల బుడతకి బంగారు పతకం