వారంతా నిరుపేదలు.. ఉన్న ఊరిని.. అయినవారిని వదిలి.. పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు.. నాలుగు రాళ్లు సంపాదించుకుని కుటుంబ కష్టాలు తీరుద్దామనుకున్న వారి ఆశలను కరోనా అడియాసలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది గల్ఫ్ దేశాల్లో పనుల్లేక.. చేతిలో చిల్లిగవ్వ లేక.. ఆకలితో అల్లాడుతున్నారు.. కొందరు వైరస్ బారిన పడి వైద్య సహాయం అందక అర్థిస్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు స్థానికులనే తప్ప.. ప్రవాసులను పట్టించుకోవడం లేదు. ఫలితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఒమన్, ఖతర్, బహ్రెయిన్‌లలో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సౌదీలో కేసుల సంఖ్య 17 వేలు దాటగా, యూఏఈ, ఖతర్ దేశాల్లో ఒక్కోచోట 10 వేల మందికి పైగా ఇది సోకింది. గల్ఫ్ దేశాల్లో వ్యాధి ఉద్ధృతితో అక్కడి ప్రవాస భారతీయులు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఇబ్బంది పడుతున్నారు.
ఈ దేశాల్లో 25 లక్షల మంది వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారున్నారు. ఆయా దేశాల్లో స్థిరపడిన వారే గాక తాత్కాలిక వీసాలపై వెళ్లిన వారు అక్కడ పనిచేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో చమురు కంపెనీలు, గ్యాస్ స్టేషన్లు, నిర్మాణ సంస్థలు, హోటళ్లు, పర్యాటక ప్రాజెక్టులు, ఐటీ పరిశ్రమలు, రోడ్‌వేస్, ప్యాకింగ్, తదితర చోట్ల పనిచేసేవారు. కరోనాతో ఆయిల్ కంపెనీలను మూసివేశారు. నిర్మాణాలు నిలిచిపోయాయి. ఐటీ పరిశ్రమలు ఇంటి నుంచే పనిచేయాలనే నిబంధనలు విధించాయి. పర్యాటక రంగం వెలవెలబోయింది. రంజాన్ మాసం అతి ముఖ్యమైనది కాగా యూఏఈలో కొద్దిమేరకు ఆంక్షలు సడలించగా మిగిలిన దేశాలు కర్ఫ్యూను కొనసాగిస్తున్నాయి. కువైట్ కర్ఫ్యూ వేళలను మరింతగా పెంచింది.
ప్రవాసుల అగచాట్లు
గల్ఫ్ దేశాల్లోని సౌదీలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆయా దేశాల్లో ఇప్పటి వరకు వైరస్ బారిన పడి మరణించిన వారిలో 25 మందికి పైగా భారతీయులు ఉన్నారు. ఇందులో కేరళకు చెందిన వారు ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా నిజామాబాద్‌కు చెందిన ఒకరి పేరు మాత్రమే కువైట్‌లో నమోదైంది. సౌదీ, యూఏఈలలోని ప్రవాసుల్లో ఎక్కువమంది దీని బారిన పడ్డట్లుగా చెబుతున్నారు. భారత్‌లో కరోనా వ్యాధిగ్రస్తుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపి చికిత్స అందిస్తోంది. గల్ఫ్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రవాసులను అక్కడి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. సాధారణ ఆసుపత్రుల్లో మాత్రమే చికిత్స జరుగుతోంది. కార్మిక క్షేత్రాల్లో ఎక్కువ మంది నివసిస్తున్నారు. వారిని వేర్వేరుగా తరలించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించడం లేదు. ప్రవాసులకు పనులు లేకపోవడం వల్ల నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా ఉన్న సంస్థలు మినహాయిస్తే ప్రభుత్వం నుంచి సాయం శూన్యమే.
ఇవీ చదవండి.. సీఎంకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్.. ఎందుకంటే?