కరోనా కల్లోలం అంతటా కలవరానికి గురి చేస్తోంది. సెకండ్ వేవ్ తీవ్రత మొదటి దఫా కంటె ఎక్కువగా ఉండడం వల్ల బాధితులు గణనీయంగా పెరుగుతున్నారు. గత సంవత్సరం కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించారు. దీంతో అన్ని రంగాల కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. ఆ తర్వాత సడలింపులతో క్రమేణా పుంజుకుంటూ వచ్చాయి. కరోనా, లాక్డౌన్, తదనంతర పరిణామాలతో గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం బాగా తగ్గింది.
వ్యాప్తిని నిరోధించేందుకు
ప్రస్తుతం కూడా అదే రకంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదాయం దెబ్బతింటుందని, వివిధ వర్గాల ప్రజలు దెబ్బతింటారన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ లాంటి కఠిన నిర్ణయాల జోలికి ఇప్పటికి వెళ్లలేదు. కొవిడ్ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. దీంతో రాత్రి ఎనిమిది గంటల వరకే దుకాణాలు, సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచి ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఆంక్షలకు తోడు చాలా చోట్ల వివిధ వర్గాల వారు స్వచ్ఛందంగా కొన్ని ఆంక్షలు విధించుకున్నారు.
పడిపోనున్న ఆదాయం
ఓ వైపు కరోనా కేసుల ఉద్ధృతి పెరగడంతో ప్రజలు రాక, మరోవైపు వైరస్ వ్యాప్తిని నివారించేందుకు పనివేళలు కుదించుకున్నారు. ఇక వైరస్ భయంతో ప్రజలు కూడా సినిమా థియేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లడం తగ్గించారు. దీంతో ఆయా రంగాల కార్యకలాపాలు బాగా నెమ్మదించాయి. ఇతర రంగాల్లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. మొదటి విడత నుంచి కోలుకోకముందే సెకండ్ వేవ్ ప్రభావం ఆయా రంగాలపై పడుతోంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా పడిపోనుంది.
ఆ రంగాలపై ప్రభావం
గత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి పడిపోయిన ఆదాయం చివరి త్రైమాసికంలో పుంజుకొంది. చివరి మూడు నెలల్లో ఆదాయం బాగానే వచ్చింది. అయితే కొత్త ఆర్థిక సంవత్సరంలో మళ్లీ వైరస్ ఉద్ధృతి పెరగడంతో ఆయా రంగాలపై ఆ ప్రభావం పడుతోంది. దీంతో సర్కార్ ఖజానాకు ఆదాయం కూడా తగ్గనుంది. మార్చి నెల కార్యకలాపాలకు సంబంధించి జీఎస్టీ ఏప్రిల్లో చెల్లిస్తారు. కాబట్టి ఈ నెలలో ప్రభుత్వ ఆదాయానికి అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ, మే నెల నుంచి మాత్రం బాగా తగ్గనుంది. అటు ప్రభుత్వానికి భారం కూడా పెరుగుతోంది. సంక్షేమ కార్యక్రమాలను కచ్చితంగా అమలు చేయడంతోపాటు ప్రైవేట్ ఉపాధ్యాయులకు సర్కార్ సాయం అందిస్తోంది. ఉద్యోగుల వేతన సవరణ అమలు చేయాల్సి ఉంది. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. వీటన్నింటి నేపథ్యంలో రానున్న కాలంలో మరోమారు ఆర్థిక ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.
ఇదీ చూడండి : 'మాస్క్ ధరించని వారిపై వారంలోనే 16 వేల కేసులు'