కరోనా ప్రభావం ఆహార వ్యాపారంపైనా భారీగా పడింది. తినుబండారాల దుకాణాలపై ఆధారపడి పనిచేస్తున్న వారి ఉపాధికి గండం ఏర్పడుతోంది. బేకరీలు, మిఠాయి దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, టీ షాపుల్లో తయారు చేసిన ఆహార పదార్థాలు కొనేవారు తగ్గిపోయి కొన్నిచోట్ల వ్యాపారాలు మూసివేస్తున్నారు. చాలాచోట్ల చాయ్ దుకాణాలు బోసిపోయాయి. ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. టిఫిన్ సెంటర్లలో టేక్‌అవేకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రజలు ఇంటి ఆహారానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. లాక్‌డౌన్‌కు ముందు ఉన్న సరకు పాడైపోవడం వల్ల కొన్ని మిఠాయి దుకాణాల్లో ఇప్పటికే పెట్టుబడి నష్టం జరిగింది. మూడు నెలల నుంచి వ్యాపారులకు దుకాణ అద్దె భారం తోడైంది. గిరాకీ తక్కువగా ఉంటుందని ముందస్తుగా అంచనా వేసిన కొందరు నిర్వాహకులు తాజాగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. స్వీట్ల బదులు బూందీ, మిక్చర్ వంటివి విక్రయిస్తున్నారు.
"రోజూ మిర్చి, బజ్జి, బోండా, జిలేబీ అప్పటికప్పుడు చేసి విక్రయించేవాళ్లం. కరోనాకు ముందు గిరాకీ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అసలు గిరాకీ లేదు’’ అని నగరానికి చెందిన వ్యాపారి తెలిపారు. వరంగల్ నగరంలో కాళోజీ చౌరస్తాలోని టీ దుకాణాలన్నీ బోసిపోయాయి.
నాడు 1,200 చాయ్‌లు అమ్మేచోట ఇప్పుడు 100 కూడా లేదు:
వరంగల్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఇరానీ చాయ్ దుకాణంలో లాక్‌డౌన్‌కు ముందు.. రోజుకి 1,200 చాయ్‌లు అమ్మేవారు. ఇప్పుడు 100 కూడా విక్రయించలేకపోతున్నారు. మూడునెలల లాక్‌డౌన్ అద్దె భారానికి తోడుగా ఇప్పుడు గిరాకీ లేకపోవడం వల్ల పెట్టుబడి వ్యయం రావడం లేదు. గిరాకీ తగ్గినందున పెట్టిన టీ సాయంత్రం కాగానే పారబోయాల్సి వస్తోందని వ్యాపారులు వాపోతున్నారు.
నిర్వహణ కష్టంగా మారుతోంది..
"కరీంనగర్ మంచిర్యాల చౌరస్తాలో బేకరీ ఉంది. లాక్‌డౌన్ ప్రకటనతో ఇక్కడి యూపీ కూలీలు సొంతూరు వెళ్లిపోయారు. అప్పట్లో రోజుకి 200 పఫ్‌లు తయారు చేసి అమ్మేవాళ్లం. రోజుకి అరకేజీ, కిలో పరిమాణం కలిగిన కేక్‌లు 30 విక్రయించేవాళ్లం. రోజుకీ రూ.50 వేల గల్లా అయ్యేది. లాక్‌డౌన్‌తో పరిస్థితి మారిపోయింది. పఫ్‌లు రోజుకి 20 కూడా అమ్ముడు పోవడం లేదు. కేక్‌లు చిన్నవి నాలుగు విక్రయించితే గొప్ప. గిరాకీ లేకపోవడం వల్ల నిర్వహణ కష్టంగా మారుతోంది. అద్దె చెల్లింపుపై వాయిదా కోసం యజమానిని బతిమిలాడి దుకాణం నిర్వహిస్తున్నా."
-అజయ్, బేకరీ దుకాణం, కరీంనగర్
స్వీట్ల రకాలు తగ్గించా...
"కరీంనగర్‌లో మిఠాయి దుకాణం నిర్వహిస్తున్నా. లాక్‌డౌన్‌కు ముందు వ్యాపారం బాగుండేది. కనీసం 150 స్వీట్‌ప్యాకెట్లు విక్రయించేవాళ్లం. 30 రకాల స్వీట్లు ఉండేవి. ఇప్పుడు గిరాకీ లేదు. ఎవరైనా కొన్నా పావు కిలో కన్నా తక్కువగా తీసుకుంటున్నారు. రోజుకి 40 ప్యాకెట్ల అమ్మకం కూడా కష్టమవుతోంది. స్వీట్లు నాలుగు రోజుల్లో విక్రయించకుంటే పాడవుతాయి. అందుకే కొత్తరకాల స్వీట్లు తయారు చేయడం లేదు. ఎక్కువ గిరాకీ ఉన్న 15 రకాల స్వీట్లు మాత్రమే అందుబాటులో పెట్టాం."
- అనిల్ మేశ్రం, మిఠాయి దుకాణం, కరీంనగర్
గిరాకీ లేక మళ్లీ మూసివేశా
"నల్గొండ పట్టణంలో రెండు ఛాట్‌బండార్‌లు ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు రోజుకి రూ.10వేల వ్యాపారం జరిగేది. నిర్వహణ ఖర్చులు, సిబ్బంది వేతనాలు తీసివేయగా కుటుంబపోషణకు మిగిలేది. లాక్‌డౌన్ నిబంధనల సడలింపు తరువాత తెరిచినా గిరాకీ లేదు. మూడు రోజులు వేచి చూస్తే రూ.2వేల వ్యాపారం జరగలేదు. గిరాకీ లేకపోవడం వల్ల మళ్లీ దుకాణాలు మూసివేశాను."
- వెంకట్, ఛాట్‌బండార్ వ్యాపారి, నల్గొండ
ఇవీ చూడండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్