విద్యుత్తు ఆదా..

- నెలవారీ బడ్జెట్‌లో ఆదా చేసేందుకు అవకాశం ఉన్న వాటిలో విద్యుత్తు వినియోగం ఒకటి. వృథా ఎక్కడెక్కడ జరుగుతోందో గుర్తించి ఆదా చేసుకోవాలి. స్లాబు పెరిగే కొద్దీ యూనిట్ ఛార్జీ పెరుగుతుందని గుర్తించాలి.
- ఇప్పటికీ చాలామంది ఇళ్లలో, ఇంటి బయట సాధారణ బల్బులు, సీఎఫ్‌ఎల్ వినియోగిస్తున్నారు. వీటి స్థానంలో ఎల్‌ఈడీకి మారితే లైటింగ్ వినియోగంలో 60 శాతం వరకు విద్యుత్తు ఆదా అవుతుంది.
- పది, పదిహేను ఏళ్ల నాటి ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పనిచేస్తున్నాయి కదా చాలామంది వాడుతుంటారు. ఇవి విద్యుత్తును అధికంగా వినియోగిస్తాయి. వీటి స్థానంలో నక్షత్ర గుర్తింపు ఉన్న బీఈఈ రేటింగ్ కలిగిన ఉపకరణాలు మేలు.
- వాషింగ్ మెషన్‌కు సరిపడా దుస్తులు ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. స్నానం చేసేందుకు గీజర్‌ను అందరూ తలోసారి వేయకుండా.. ఒకసారి వేశాక అందరూ వెంటవెంటనే ఉపయోగిస్తే కరెంట్ బిల్లు చాలా వరకు ఆదా అవుతుందంటున్నారు.
తలంటు దగ్గర్నుంచి..

- దాదాపు ప్రతి ఇంట్లో ఇప్పుడు షాంపు వినియోగం తప్పనిసరి. సాధారణంగా షాంపూ డబ్బాల మూత పెద్దదిగా ఉంటుంది. అది వ్యాపార సూత్రం. నొక్కితే ఒకేసారి ఎక్కువ మొత్తం చేతిలోకి వస్తుంది. ఒక్కసారి బయటికి వచ్చాక ఎక్కువైనా తిరిగి డబ్బాలోకి పంపలేం. కాబట్టి అవసరానికి మించే తలకు రుద్దుకుంటాం.
- డబ్బాను నొక్కేటప్పుడు.. అరచేతిపైన కాకుండా చేతి వేళ్లను డబ్బా మూతికి అడ్డుపెట్టి నొక్కాల్సి ఉంటుంది. అప్పుడు అవసరమైన మేరకే చేతిలోకి వస్తుంది.
- ఎక్కువ గాఢత కలిగిన మిశ్రమం కాబట్టి రెండు మూడు చుక్కల షాంపు తలకు సరిపోతుంది. మాడుపై నుంచి రుద్దుకుంటే వెంట్రుకల మొత్తానికి సరిపోతుంది.
ఇంటి వంట..

- లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి బయటి ఆహారం తగ్గించడంతో అదనపు ఖర్చులు తగ్గిపోయాయి. ఒక వారం బయట తిండికి చేసే వ్యయంతో నెలలో నాలుగైదుసార్లు ఇంట్లోనే విందు భోజనాలు చేస్తున్నారు. పుట్టిన రోజు వేడుకలకు ఇంట్లోనే కేకు తయారు చేసుకుంటున్నారు.
- ఇటీవల చాలామంది పెరుగును బయట కొంటున్నారు. బయట మార్కెట్లో 200 గ్రాముల పెరుగు డబ్బా రూ.25కు వస్తోంది. ఇది ఒకపూట ఇద్దరు ముగ్గురికి మించి సరిపోదు. ఇదే ఖర్చుతో ఇంటో పాలు తోడుపెట్టుకుంటే కుటుంబంలో అందరికీ రెండుపూటలా సరిపోయే పెరుగు సిద్ధమవుతుంది.
- బయటి ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండటంతో కుటుంబంలో ఆరోగ్య సమస్యలు పెద్దగా లేవని పలువురు అభిప్రాయ పడ్డారు.
- కరోనాతో ఇంటికి సమీపంలో ఉండే కిరాణా దుకాణాల్లో అవసరమైన మేరకే కొనుగోలు చేస్తుండటంతో వృథా ఖర్చులు తగ్గాయని గృహిణులు అంటున్నారు.
గ్యాస్ ఆదా..

- ఒకరింట్లో వంట గ్యాస్ రెండు నెలలు వస్తే.. మరికొందరి ఇళ్లలో నెలకే అయిపోతుంది. ఇద్దరి ఇళ్లలో కుటుంబ సభ్యుల సంఖ్య సమానమే అయినా ఎందుకింత వ్యత్యాసం అంటే.. వృథానే కారణం.
- నలుగురు సభ్యులుంటే ఒక్కొక్కరికి ఒక్కోసారి తేనీరు పెడుతుంటారు. అందరూ ఒకేసారి తీసుకుంటే గ్యాస్ ఆదా.
- స్టవ్‌ను తక్కువ మంటలో వినియోగించాలి. ఇది వృథాని తగ్గిస్తుంది.
- నీళ్లు వేడయ్యాక స్నానం చేయడాన్ని వాయిదా వేస్తుంటారు. అప్పటికే నీళ్లు చల్లారిపోవడంతో మరోసారి వేడి చేస్తుంటారు.
- ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఎక్కువ మంది వేడినీళ్లు తాగుతున్నారు. కుటుంబానికి సరిపడా ఒక ప్లాస్క్ కొని ఒకసారి వేడి చేసి అందులో నింపితే పదేపదే వేడి చేయాల్సిన అవసరం ఉండదు.
ఇదీ చదవండి- రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు- రోజుకు 10 లక్షల దిశగా