''వృద్ధాప్యం ఆవహించింది. జీవితంలో అన్నీ చూసేశాం. బాధ్యతలు తీరిపోయాయి. ఇక బతికి సాధించేది ఏముంది'' అనే భావనతో ఎక్కువ మంది తనువు చాలిస్తున్నారు. కరోనా సోకితే ప్రాణం పోతుందనే ఆపోహతో కొందరు, ఇరుగుపొరుగు భయంభయంగా చూస్తున్నారని ఇంకొందరు.. నా వల్ల కుటుంబ సభ్యులకు హాని జరగకూడదనే భావనతో మరికొందరు.. ఇలా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ధైర్యం చెప్పేవారు లేక, భరోసా ఇచ్చేవారు కనిపించక తమలోతామే ఆవేదన, ఆందోళనకు గురవుతూ కుంగుబాటుతో బలవన్మరణాలకు పాల్పడుతున్న వారూ ఉన్నారు. ఇలా వృద్ధులు, ఒంటరివారు ప్రాణాలు తీసుకుంటుండటం కలవరం కలిగిస్తోంది.
మౌనంగా ఉంటూ.. చివరికి చితికి
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం విఠలాపూర్‌కు చెందిన వృద్ధుడి(71)కి జ్వరం రావడంతో కుమారుడు పరీక్ష చేయించారు. మే 22న పాజిటివ్‌గా నిర్ధారణయింది. నిత్యం వ్యవసాయ పనుల్లో హుషారుగా పాల్గొనే ఆయన అప్పట్నుంచి ధైర్యం కోల్పోయారు. కుటుంబ సభ్యులతో మాట్లాడటం మానేశారు. ఆత్మహత్య చేసుకున్నారు. ‘‘నాన్నను ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉంచి మందులు వేసుకునేలా ఏర్పాట్లు చేశాం. కరోనా నిర్ధారణయిన రోజు రాత్రి పాలు తాగారు. మాట్లాడించే ప్రయత్నం చేసినా ముభావంగా ఉండిపోయారు. దిగులుతో అలా ఉన్నాడనుకున్నాం. ప్రాణం తీసుకుంటాడని అనుకోలేదు’’ అని ఆయన కుమారుడు రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
బిడ్డా.. నీకేమైనా అవుతుందేమో!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలి (75)కి జ్వరం రావడంతో హన్మకొండలో ఉండే కుమారుడు హుటాహుటిన వచ్చి పరీక్ష చేయించారు. 23వ తేదీన పాజిటివ్‌గా తేలడంతో ఆమెను ఐసొలేషన్‌లో ఉంచి భోజనం, మందులు తదితరాలు అందించే ఏర్పాట్లు చేశారు. ఏమైందో ఏమో! మరుసటిరోజే ఇంట్లో బావిలో దూకి మరణించారు. ‘‘నాన్న పాతికేళ్ల క్రితం మరణించాడు. అప్పట్నుంచి అమ్మ ఒంటరిగా ఉంటూ ధైర్యంగా జీవిస్తోంది. ఎవరికైనా ఏదైనా ఇబ్బందివస్తే ధైర్యం చెప్పేది. కరోనా సోకిన తర్వాత ‘బిడ్డా నా దగ్గరికి వచ్చిపోతున్నావు..నీకేమైనా అవుతుందేమో. దూరంగా ఉండు’ అని చెప్పింది. బహుశా తన వల్ల నాకు వ్యాధి సోకుతుందేమోననే భయంతో బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని’’ వృద్ధురాలి కుమారుడు కన్నీటిపర్యంతమయ్యారు.
కుమారుడి కుటుంబంపై ఆందోళనతో...
వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామానికి చెందిన వృద్దుడి(70)కి ఇద్దరు కుమారులు. పదేళ్ల క్రితం భార్య చనిపోయింది. బిడ్డలపై ఆధారపడటం ఇష్టంలేని ఆయన అప్పట్నుంచి ఒంటరిగా ఉంటూ, తన భోజనం తానే వండుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన పెద్ద కుమారుడు, కోడలు, మనవరాలు ఈ నెల 5న కరోనా బారినపడి, తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఆ పరిణామం ఆయనలో భయాన్ని పెంచింది. ఒకవైపు ఒంటరితనం..మరోవైపు కుమారుడి కుటుంబం ఏమవుతుందోననే ఆందోళనతో రోజురోజుకు కుంగిపోయిన ఆయన ఈ నెల 15న ఇంటి ముందున్న చెట్టుకు ఉరివేసుకున్నారు.
భయం పోగొట్టి భరోసా ఇవ్వాలి
'కరోనాకు గురైనవారి మానసికస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. ముఖ్యంగా వృద్ధులు, ఒంటరిగా ఉండేవారిని. సరిగా తింటున్నారా? మంచిగా నిద్రపోతున్నారా..? కరోనా నుంచి బయటపడతామన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నారా?..లేదా? వంటి విషయాల్ని గమనించాలి. కుంగుబాటులో ఉంటే కౌన్సెలింగ్ ఇప్పించాలి. మందులతో తగ్గిపోతుందని చెబుతూ ధైర్యాన్నివాలి. కుటుంబసభ్యుల మద్దతు ఉండాలి. వృద్ధాప్యం, ఒంటరితనంతో అప్పటికే కొంత ఇబ్బందిపడే వృద్ధులు కరోనా రాగానే జీవితం అయిపోయిందని భావిస్తున్నారు. నన్ను ఎవరుచూసుకుంటారు?.. చికిత్సకు రూ.లక్షల ఖర్చు భారం పిల్లలపై పడుతుందని అనుకుంటున్నారు.. కాబట్టి పిల్లలు పెద్దల ఆరోగ్యం, వృద్ధాప్య సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించాలి. నెగెటివ్‌గా, అధికంగా ఆలోచించకుండా చూడాలి. వారి ఇబ్బందులు, సందేహాలు తెలుసుకుని వైద్యుల సూచనలతో పరిష్కరించాలి.'
-డాక్టర్ జ్యోతి, సైకియాట్రిస్ట్, హైదరాబాద్
70 ఏళ్ల పైబడినవారూ కొవిడ్‌ను జయిస్తున్నారు
'కొవిడ్ సోకిందని తెలియగానే కొందరు అనవసరమైన ఆందోళనకు గురవుతున్నారు. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం చాలా బాధాకరం. పాజిటివ్ రాగానే వైద్యుల సూచనలతో హోం ఐసొలేషన్‌లో ఉండాలి. అవసరమైతే ఆసుపత్రిలో చేరాలి. కొందరు సామాజిక మాధ్యమాల్లో వచ్చే గణాంకాలు, ఇతర ఆందోళనకర విషయాలను చూసి భయానికి లోనవుతూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వరంగల్ ఎంజీఎంలో వెంటిలేటర్ వరకు వెళ్లిన వారు కూడా కోలుకుంటున్నారు. 70 ఏళ్ల పైబడిన వారు కూడా కొవిడ్ నుంచి బయటపడి సురక్షితంగా ఇంటికి వెళుతున్నారు. వైద్యుల సూచనలు పాటించి, మంచి ఆహారం తీసుకొని చికిత్స తీసుకుంటే 95 శాతం బయటపడతారు.'
- డాక్టర్ కాజీపేట వెంకటరమణ, సివిల్ సర్జన్, ఎంజీఎం, వరంగల్
ఇదీ చదవండి: దూరమవుతున్న బంధాలు.. వెంటాడుతున్న భయాలు