లాక్‌డౌన్‌లో ‘నా ఇల్లే ఇండియా’ అనుకుంటూ జవాన్‌లా ముందు నడవాలి. కరోనా కోరలకు చిక్కకుండా ఇంటిల్లిపాదికీ రక్షణగా నిలవాలి. ముఖ్యంగా ఇంట్లో పెద్దలు, పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. అందరిలో మానసిక స్థైర్యాన్ని నింపుతూ.. ఆందోళనకు గురవకుండా జాగ్రత్త పడాలి. ఉడుకు రక్తానికి ఉన్న వేడి సెగతో కరోనాను ఇంటి దరిదాపుల్లోకి రాకుండా చూసుకోవాలి. అందుకు యువత ఏం చేయాలి?
ఇంటికి మీరొక్కరే!
లాక్‌డౌన్ ముగిసే వరకూ ఇంట్లో ప్రతి ఒక్కరికీ మీరే డెలివరీ బాయ్ అవ్వాలి. ఎవ్వరినీ గడపదాటనివ్వొద్దు. అందరి ఆర్డర్లను ఒకేసారి చెక్‌లిస్ట్‌లో పెట్టుకుని రెండు, మూడు రోజులకు సరిపడా డెలివరీ చేసేయండి. ఒక్కటే గుర్తుంచుకోండి.. కనిపించని శత్రువుకి పదే పదే ఎదురు వెళ్లడం ఏ మాత్రం సురక్షితం కాదు. అది మీతో పాటు మీకే తెలియకుండా ఇంట్లోకి ప్రవేశించొచ్చు.
కాలాన్ని కరిగిపోనివ్వొద్దు
లాక్‌డౌన్‌లో కొన్ని వారాలెలాగూ గడిచిపోయాయి.. మరికొన్ని వారాలైనా అయోమయంగా కరిగిపోకుండా అమూల్యమైన క్షణాలుగా గడిపేందుకు ప్లాన్ చేయండి. ఎప్పుడూ మీ భవిష్యత్తు ప్రణాళికతో బిజీగా ఉండే మీరు.. ఇంట్లోవాళ్లపై ఓ కన్నేయండి. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో గుర్తించండి. ఉదాహరణకు ఎప్పుడూ వంటింట్లో వంటలు చేస్తూ ఉండే అమ్మలో మంచి గాయని ఉండొచ్చు. పాడమని ప్రోత్సహించి రికార్డు చేసి ఫేస్‌బుక్‌లో పెట్టండి. ఫైళ్లతో ఎప్పుడూ బిజీగా ఉండే నాన్నలో డైలాగ్ కింగ్ ఉండొచ్చు. తనకిష్టమైన హీరో డైలాగ్ చెప్పమని షూట్ చేసి ట్విటర్‌లో పెట్టండి. అప్పుడు క్లిక్కులు, లైక్‌లకు కొదవుండదు. మీకొచ్చే సంతృప్తికి కొలత ఉండదు.
అపోహలకు చెక్ పెట్టండి
ఎటు చూసినా కరోనా వార్తలే. దానికి తోడు వాట్సాప్‌లో మరొకటి.. ఫేస్‌బుక్‌లో ఇంకోటి.. ఏదో ప్రళయం వచ్చేస్తోంది అన్నట్టుగా ఫేక్ న్యూస్. హాలులో అమ్మానాన్న... ఎదురింట్లో ఆంటీ, అంకుల్.. ఒకటే చర్చలు. ఏమవుతుందో అని విశ్లేషణలు. ఇవన్నీ వింటున్న పెద్దవారికి మానసిక ఆందోళన. ఈ వాతావరణానికి చెక్ పెట్టాలి. కరోనాపై ఏది నిజమో. ఏది అబద్ధమో తెలియజేస్తూ చైతన్య పరచాలి. పాజిటివ్ దృక్పథాన్ని పెంపొందించాలి.
ఆపాత మధురాలు.. మళ్లీ!
బోర్ అనిపిస్తే ఫోన్ అందుకుని హాయిగా పాటలు వినేస్తాం, సినిమా చూసేస్తాం. మరి, తమ గది కిటికీలో నుంచి బయటికి చూసే అమ్మమ్మ, తాతయ్యల పరిస్థితి ఏంటి? అందుకే.. వాళ్ల మధ్యలో కూర్చుని ఫోన్‌లో పాత పాటలో.. వారికి ఇష్టమైన సినిమాని ఓటీటీలోనో పెట్టండి. కలిసి మీరూ చూడండి. వారి టీనేజ్ రోజుల్ని గుర్తు చేసి.. గతం జ్ఞాపకాల్లోకి వారితో కలిసి మీరూ వెళ్లండి.
ఫిట్‌నెస్ ట్రైయినర్‌లా..
ఉదయం నడకకు వెళ్లే తాతయ్య.. స్పోర్ట్స్ క్లబ్‌కి వెళ్లే నాన్న.. యోగాకి వెళ్లే చెల్లీ.. అందరూ లాక్‌డౌన్‌తో అన్నీ బంద్ చేసి కూర్చున్నారా? ఒకటీ.. రెండు రోజులైతే ఫర్వాలేదు. వారాల తరబడి వ్యాయామం చేయకుంటే మంచిది కాదు. అందుకే మీరే ఫిట్‌నెస్ ట్రైనర్‌లా వారికి సరిపడే వ్యాయామాల్ని సూచించి ప్రోత్సహించాలి. ముఖ్యంగా పెద్దలకు శ్వాసకోశ సంబంధ వ్యాయామాల్ని సాధన చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఐక్యత చాటేలా..
ఇంట్లో ఎవరికైనా కష్టం వస్తే.. చుట్టూ నలుగురూ చేరి సపోర్టుగా నిలుస్తాం. అదే ఐక్యతతో దేశానికి వచ్చిన కరోనా కష్టాన్ని ఎదుర్కొనేలా ఇంటిల్లిపాదినీ సిద్ధం చేయాలి. అందరూ కలిసి ఇంట్లో కొంత ఆహారాన్ని తయారు చేయండి. వాటిని పొట్లాలుగా కట్టి మీ ఇంటికి దగ్గర్లో గూడు లేక నిరాశ్రయులైన వారికి అందించండి. ఇరుగు పొరుగు, స్నేహితుల్లో ప్రేరణ కలిగించేలా మీరే మొదటి అడుగు వేయండి.
ఇవీ చదవండి: కరోనా తగ్గకపోతే టోక్యో ఒలింపిక్స్ కష్టమే!