యావత్ సమాజాన్ని తీవ్ర భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా మహమ్మారి వల్ల.. నేడు మృతదేహాల దహనం పెద్ద సమస్యగా మారింది. కొవిడ్ మృతదేహాల దహనాన్ని కూడా కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి, పగలు అని తేడా లేకుండా ఆయా శవాలను దహనం చేయడానికి వేల రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అనేక కారణాలు చెబుతూ రూ.20 నుంచి 30 వేల దండుకుంటున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
బిక్కుబిక్కుమంటూ..
ఇదిలా ఉండగా ఒకే స్మశానవాటికలో కుప్పలు కుప్పలుగా కరోనా శవాలను దహనం చేయడం కారణంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలు తీవ్ర భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి స్మశాన వాటికలో అక్కడ పరిస్థితులకనుగుణంగా 2, 4, 6 మృతదేహాలను దహనం చేయాలి. ప్రస్తుతం డబ్బులకు కక్కుర్తిపడి రాత్రి, పగలు అనే తేడా లేకుండా 8, 10, 12 కరోనా మృతదేహాలను దహనం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వ్యతిరేకం కాదు..
శవాల దహనానికి తాము వ్యతిరేకం కాదని, ఇష్టానుసారంగా స్మశాన వాటికలో కరోనా మృతదేహాలను సమయపాలన లేకుండా దహనం చేయడం కారణంగా వాయు కాలుష్యం ఏర్పడుతోందన్నారు. దీనివల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు తెలిపారు. తమ పిల్లల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుందని.. వాంతులు చేసుకుంటున్నారని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
యుద్ధం చేయాలా..
ఒకవైపు కరోనా మహమ్మారితో పోరాటం.. మరోవైపు కొవిడ్ మృతదేహాలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్, ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌తో మృతి చెందినవారి దేహాలను ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ, దోమలగూడ, ముషీరాబాద్ బాపూజీ నగర్ తదితర ప్రాంతాల్లోని స్మశాన వాటికలకు తెస్తున్నారన్నారు. తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి వరకు పదుల సంఖ్యలో దహనం చేస్తున్నారని వాపోయారు.
'ప్రభుత్వ నియమాల ప్రకారం స్మశాన వాటికల పరిస్థితులను బట్టి 2 నుంచి 5 వరకు మాత్రమే మృతదేహాలను దహనం చేయాల్సిన నియమం ఉంది. ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆరు స్మశానవాటికలను కరోనా మృతదేహాల దహనానికి కేటాయించారు. ఇటీవల కాలంలో అర్ధరాత్రి 8 మృతదేహాలను కవాడిగూడలోని స్మశానవాటికలో దహనం చేశారనే విషయం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఈ విషయం మా దృష్టికి రాగానే ఆయా స్మశానవాటికల నిర్వాహకులతో ప్రభుత్వ నియమాలను వివరించాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం' - ఏఎంహెచ్ఓ హేమలత, ముషీరాబాద్.
ఇదీ చూడండి: రేపటి నుంచి రాష్ట్రంలో కొవిడ్ టీకా మొదటి డోసు నిలిపివేత