జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. చంచల్‌గూడ ప్రభుత్వ ముద్రణాాలయంలో కరోనా కలవరం రేపింది. ముద్రణ కేంద్రంలో పనిచేస్తున్న ఆరుగురికి కరోనా సోకగా... కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. ఇక మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రిలో తాజాగా మరో ఇద్దరు వైద్యులకు కరోనా సోకింది. ఈ ఘటనతో 2 రోజుల పాటు ఆపరేషన్ థియేటర్, లేబర్ రూంలను మూసేశారు.
ఒక్క యూసఫ్ గూడలోనే 79 మందికి...
ఇక యూసఫ్‌గూడ సర్కిల్లో గురువారం 79 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్టు అధికారులు ప్రకటించారు. జీహెచ్ఎంసీ కార్యాలయ బ్యాంకులో పనిచేసే ఓ ఉద్యోగి తాజాగా కరోనా బారినపడ్డారు. నాదర్గుల్లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా... అబ్దుల్లాపుర్మెట్కి చెందిన ఓ వైద్యుడి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సోకింది. గతంలోనే ఆ వైద్యుడు కరోనా భారిన పడగా... అనుమానంతో డ్రైవర్‌కి పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. ఇంజాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కొవిడ్ నిర్ధరణ అయింది. ఇప్పటి వరకు గ్రామంలో కరోనా బాారిన పడిన వారి సంఖ్య 9కి చేరింది.
పోలీసు సిబ్బందిలో కలవరం...
నాచారం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్‌కు, పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో మరో మహిళా కానిస్టేబుల్ కరోనా బారిన పడ్డారు. మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. ఈ కేసులతో ఇవాళ తాజాగా 8 మంది పోలీసు సిబ్బందికి కరోనా నిర్ధరణ అయ్యింది.
బేగం బజార్ వారం రోజులు బంద్...
యాచారం మండలం నక్కగుట్ట తండాలో ఇద్దరికి కరోనా సోకింది. బోడుప్పల్కి చెందిన మరో యువకుడు కరోనా బాారిన పడినట్టు అధికారులు తెలిపారు. మణికొండలో ఓ వృద్ధుడు కరోనాతో మృతి చెందినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా హైదరాబాద్‌లో కిరాణ మర్చంట్స్ అసోసియేషన్ వారం రోజుల పాటు బేగంబజార్‌ని మూసివేయాలని నిర్ణయించింది.