రాష్ట్రంలో కరోనా ఉద్దృతి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 58వేల 264 పరీక్షలు చేయగా.... 2వేల 734మందికి వైరస్ సోకినట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది. తాజాగా కరోనాతో 9 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 836కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య లక్షా 27 వేల 697కు పెరిగింది. తాజాగా 2వేల 325 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మహమ్మారిని జయించిన వారి సంఖ్య 95వేల 162కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 31వేల699 యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్‌లో 24వేల 598 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇంకా 878 నమునాల ఫలితాలు రావాల్సి ఉందన్న వైద్యఆరోగ్యశాఖ.. ఇప్పటివరకు 14 లక్షల 23 వేల 846 కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో మరో 347 మందికి వైరస్ సోకింది. జిల్లాల్లోనూ బాధితుల సంఖ్య పదుల నుంచి వంద సంఖ్యకు చేరుతోంది. రంగారెడ్డి 212, నల్గొండ 191, ఖమ్మం జిల్లాలో 161 కొత్త కేసులు వెలుగు చూశాయి. మల్కాజిగిరి 121, భద్రాద్రి కొత్తగూడెం 117, నిజామాబాద్ 114, వరంగల్ పట్టణ జిల్లాలో 112 మందికి వైరస్ సోకింది. సిద్దిపేట 109, సూర్యాపేట 107, కరీంనగర్ 106, మంచిర్యాలలో 96 కొత్త కేసులు బహిర్గతమయ్యాయి. జగిత్యాల 91, మహబూబాబాద్ 81, యాదాద్రి భువనగిరి 76, పెద్దపల్లి జిల్లాలో 74 మంది బాధితులను గుర్తించారు. కామారెడ్డి 72, మహబూబ్‌నగర్ 66, వనపర్తి 55, రాజన్న సిరిసిల్లలో 49 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. నాగర్‌కర్నూల్ 48, జనగాం 47, మెదక్ 43, జోగులాంబ గద్వాల 42, నిర్మల్ 39, వరంగల్ గ్రామీణ జిల్లాలో 30 మంది వైరస్ బారినపడ్డారు. ఆదిలాబాద్ 27, మలుగు 24, నారాయణపేట 18, సంగారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 16 చొప్పున కేసులు నమోదుకాగా... జయశంకర్ భూపాలపల్లి 15, వికారాబాద్ జిల్లాలో 12 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్దరణ అయింది.
దేశంలో కరోనా రికవరీ రేటు 76.94శాతం ఉండగా.. రాష్ట్రంలో 74.5గా ఉందని వైద్యారోగ్యశాఖ పేర్కొంది. జాతీయస్థాయిలో వైరస్ మరణాల రేటు 1.77శాతం ఉండగా.. రాష్ట్రంలో 0.65 శాతంగా ఉందని స్పష్టం చేసింది.