హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో ఒక్క రోజే 21 కరోనా కేసులు నమోదు కావడం వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది, వైద్యారోగ్య శాఖ అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా కేసులు పెరగడం వల్ల ప్రజలు భయపడుతున్నారు. నియోజకవర్గంలోని భోలక్పూర్, రాంనగర్, ముషీరాబాద్, అడిక్మెట్, గాంధీ నగర్, కవాడిగూడ డివిజన్లోని అనేక ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆశావర్కర్ల సర్వే ద్వారా వెల్లడైంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు 307కు చేరుకున్నాయి. నేటి వరకు 14మంది కరోనాతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు 60 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ సిబ్బంది, వైద్యారోగ్య శాఖ అధికారులు, ఆశావర్కర్లు ఇంటింటి సర్వే చేసినప్పటికీ కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ సిబ్బంది రసాయన ద్రావణాన్ని పిచికారి చేయడంపై దృష్టి సారించడం లేదని పలువురు ఆరోపించారు. కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో 14,419కు చేరిన కరోనా కేసులు