Corona Cases in TS: కరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతోంది. జూన్ తొలినాళ్లలో ఒక శాతానికి మించని పాజిటివిటీ రేట్... ఇప్పుడు దాదాపు మూడు శాతానికి చేరటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి వరకు కేవలం కొన్ని జిల్లాలకే పరిమితమైన కేసులు ఇప్పుడు రాష్ట్రమంతటా వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా జీహెచ్ఎంసీ, రంగారెడ్డి పరిధిలో వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
Covid cases today: తాజాగా రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య వెయ్యి మార్క్‌ను దాటింది. గడిచిన 24 గంటల్లో 43,318 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 1,061 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం మహమ్మారి నుంచి 836 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,357 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 401 కేసులు, రంగారెడ్డిలో 63, మేడ్చల్ మల్కాజిగిరిలో 56, నల్గొండ 51, రాజన్న సిరిసిల్ల 46, కరీంనగర్ 43 కేసులు వెలుగుచూశాయి.
Corona day by day increasing: ఇదిలా ఉండగా... హైదరాబాద్‌లో నిత్యం 350 నుంచి 400ల వరకు కొవిడ్ కేసులు వెలుగు చూస్తుండగా... ఆ తర్వాతి స్థానంలో రంగారెడ్డి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లోనూ కొవిడ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నట్టు ఆరోగ్య శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ తొలినాళ్లలో జగిత్యాల, జనగామ, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్, నారాయణ్ పేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్ రూరల్ ప్రాంతాల్లో దాదాపు కేసులు సున్నా కాగా... ఇప్పుడు ఆయా జిల్లాల్లోనూ నిత్యం సుమారు పదికి పైగా కేసులు నమోదవుతున్నాయి.
ప్రభుత్వం అలర్ట్: అసలే ఎడతెరపిలేని వర్షాలతో ముసుగేసిన రాష్ట్రంపై కొవిడ్ పంజా విసురుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ కేసులు పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తున్నారు. కొవిడ్ లక్షణాలు కనిపిస్తే తప్పక నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో కొవిడ్ మరణాలు సున్నాగా ఉండటం కొంత ఊరట కలిగిస్తున్న అంశం. కొవిడ్ వ్యాక్సిన్ ల ప్రభావం, గతంలో వైరస్ సోకిన వారిలో యాంటీ బాడీల ఉత్పత్తి వంటి అంశాలు కొవిడ్ మరణాలను కొంతవరకు నియంత్రిస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది.
బూస్టర్ డోస్ తప్పనిసరి... రాష్ట్రంలో మహమ్మారి మరోమారు ప్రభలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరు బూస్టర్ డోస్ తీసుకోవాలని.. మరీ ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు తప్పక టీకాలు వేయించాలని తద్వారా కొవిడ్‌ని నియంత్రించవచ్చని చెబుతోంది.
ఇదీ చూడండి: 'కాటన్' స్మిత... తెలంగాణ ట్రెండీ వేర్లో బ్రాండ్