ధరణి రిజిస్ట్రేషన్లు, భూముల వ్యవహారాలు, సర్వే విధుల్లో పాల్గొంటున్న వారిపై కరోనా పంజా విసురుతోంది. 21న మహబూబ్‌నగర్ సర్వే విభాగానికి చెందిన సర్వేయర్ సంతోష్‌కుమార్, 22న నారాయణపేట కలెక్టర్ ప్రత్యేక కార్యదర్శి నారాయణరావు, 23న తాడ్వాయి తహసీల్దారు కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ విజయ.. ఇలా వరుసగా ప్రాణాలు కోల్పోయారు.
గ్రీవెన్స్ సెల్.. సిబ్బంది హడల్
ప్రధానంగా ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లలో నిర్వహిస్తున్న ఫిర్యాదుల దినం(గ్రీవెన్స్ సెల్) వస్తోందంటే సిబ్బంది హడలెత్తిపోతున్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన సమస్యలపై నివేదించేందుకు ప్రజలు కలెక్టరేట్లకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ప్రతి దరఖాస్తును స్వీకరించి కంప్యూటర్‌లో నమోదు చేసి తిరిగి ఆయా శాఖలకు కలెక్టరేట్ నుంచి పంపిస్తున్నారు. దీంతో పలు విభాగాలు, శాఖల మధ్య దస్త్రాల రాకపోకలు, సిబ్బంది సంభాషణలు చోటుచేసుకుంటున్నాయి. ఇవికాకుండా జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చే ఆదేశాలపై క్షేత్రస్థాయి విచారణలు నిర్వహించడం, నివేదికలు పంపడం వంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయి.
రోజుకు పది రిజిస్ట్రేషన్లు జరిగే చోట కనీసం యాభై మంది హాజరవుతున్నారు. ఇవన్నీ సిబ్బంది వైరస్ బారిన పడేందుకు కారణాలవుతున్నాయి. పరిస్థితి గమనించి యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌తో పాటు మరికొన్ని జిల్లాల్లో గ్రీవెన్స్ సెల్ నిర్వహణను నిలిపివేశారు. మరోవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల భవనాలు ఒకే ప్రాంగణంలో ఉన్నచోట వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ క్రమంలో వైరస్ తీవ్రత తగ్గేదాకా పనివేళలు కుదించడం, ధరణి రిజిస్ట్రేషన్ల స్లాట్లు తగ్గించి రద్దీ నియంత్రించడం తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని జిల్లాల నుంచి ఒత్తిడి వస్తున్నట్లు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం(ట్రెసా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతంకుమార్ ‘ఈనాడు’కు తెలిపారు.
ఇదీ చూడండి: జడలు చాస్తున్న మహమ్మారి... పదిరోజుల్లోనే రెట్టింపు కేసులు