అటవీ అగ్ని ప్రమాదాల కట్టడికి స్థానికులు, సర్పంచుల సహకారం తీసుకోవాలని అటవీశాఖ నిర్ణయించింది. ప్రభావిత ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అగ్ని ప్రమాదాల తీవ్రత ఫిబ్రవరి నుంచి మే వరకు ఎక్కువ ఉండనుండటంతో ఈ నాలుగునెలల్లో కట్టడికోసం రూ.12 కోట్ల ఖర్చు చేస్తున్న అటవీశాఖ... మరో రూ.13 కోట్ల నిధుల్ని ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి ఇవ్వాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. గడిచిన మూడేళ్ల సగటు చూస్తే అటవీప్రాంతాల్లో ఏటా 40,773 ఎకరాల అటవీప్రాంతం కాలిపోతోంది.అందుకు 90 శాతం మానవ నిర్లక్ష్యం, తప్పిదాలే కారణమని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి.
స్థానికులతో ప్రత్యేక బృందాలు..
ప్రమాద స్థలానికి తక్షణమే చేరుకునేందుకు వీలుగా 45 తక్షణ స్పందన బృందాలను తాజాగా ఏర్పాటుచేసినట్లు అటవీశాఖ తెలిపింది. ‘ఉపగ్రహాల నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి దేహ్రాదూన్‌లోని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణ అటవీశాఖకు ఫైర్ అలర్ట్‌లు పంపుతోంది. ఈ సమాచారంతో నియంత్రణ చర్యలు చేపడుతున్నాం. మరోవైపు అగ్నిప్రమాదాలు అధికంగా జరిగేప్రాంతాలపై దృష్టిపెట్టాం.
జీపుతో కూడిన ఒక్కో బృందంలో ఐదుగురు స్థానికులు ఉంటారు. వీరిసేవల్ని ఫిబ్రవరి నుంచి మే వరకు ఉపయోగించుకుంటాం’ అని సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి లోకేష్‌జైశ్వాల్ తెలిపారు. ‘సర్పంచుల సహకారం తీసుకుంటున్నాం. ప్రమాదాలు ఎక్కువగా జరిగే జోన్లు, బీట్లను గుర్తించి..సమీప గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. సహకారం కోసం అగ్నిమాపక శాఖతో కూడా మాట్లాడాం. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు రావల్సి ఉంది’ అని అదనపు పీసీసీఎఫ్ ఫర్గెయిన్ తెలిపారు.
ఇదీ చూడండి : కోటిన్నర మొక్కలు నాటే ఛాలెంజ్‌కు మహేశ్ బాబు మద్దతు