హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తోన్న మహేశ్వరం నరహరి పెయింటింగ్ వేయడంలో నేర్పరి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు లక్ష్యంగా వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఏడాది పాటు కొవిడ్‌పై అవగాహన కల్పిస్తూ ఎన్నో రకాల చిత్రాలు వేసిన నరహరి గిన్నీస్ బుక్‌లో స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు 65 గంటల పాటు నిరంతర పెయింటింగ్ వేయాలని నిర్ణయించుకుని తన నివాసంలో ఈ కార్యక్రమం ప్రారంభించారు.
గతంలో 60 గంటల పాటు పెయింటింగ్ వేసిన రికార్డు వేరే వ్యక్తిపై ఉందని ఆ రికార్డును అధిగమించాలనే ఉద్దేశంతో 65 గంటల పాటు చిత్రాలు వేయాలని సంకల్పించినట్లు నరహరి చెప్పారు. త్వరలోనే తను వేసిన చిత్రాలతో చిత్రకళ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
కరోనా చిత్రాలతో అవగాహన
అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కరోనా చిత్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నరహరి తెలిపారు. మాటలతో చెప్పే దానికంటే చిత్రాల ద్వారా చూపిస్తే పిల్లలకు త్వరగా అర్థమవుతుందని వివరించారు. ఇప్పటికే తన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి బహుమతులు అందుకుంటున్నారని వెల్లడించారు.
ఇదీ చదవండి: వెళ్లేవారు ఎంతమందో... వచ్చేవారూ అంతమందే