రాయితీ అంటూ ఆకర్షించి.. పూర్తి బిల్లు వసూలు చేసిన సికింద్రాబాద్‌లోని చెన్నై షాపింగ్‌మాల్.. వినియోగదారుడికి రూ.15,306 చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-3 ఆదేశించింది. నాచారం భవానీ నగర్‌కు చెందిన సీహెచ్ శ్రీకాంత్ చరవాణికి 2019 అక్టోబరు 19న చెన్నై షాపింగ్‌మాల్ నుంచి రాయితీకి సంబంధించిన సందేశం వచ్చింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా లావాదేవీ జరిపితే 5 శాతం వరకు బిల్లులో తగ్గింపు వస్తుందని పేర్కొన్నారు. అదే నెల 27న ఆ షాపింగ్ మాల్‌కు వెళ్లిన ఆయన.. రూ.4,083తో నూతన వస్త్రాలు, రూ.2,030తో ఆభరణాలు కొనుగోలు చేశారు.
ఎస్‌బీఐ కార్డుతో బిల్లు చెల్లించినా రాయితీ ఇవ్వలేదు. దీంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా.. విచారణ జరిపిన కమిషన్-3 అధ్యక్షుడు ఎం.రామ్‌గోపాల్‌రెడ్డి, సభ్యులు డి.శ్రీదేవి, జె.శ్యామల బెంచ్.. సాక్ష్యాధారాలు పరిశీలించి వినియోగదారుడి వాదనలతో ఏకీభవించింది. ఆయన నుంచి అదనంగా వసూలు చేసిన 5 శాతం (రూ.306), పరిహారం కింద రూ.10 వేలు, కేసు ఖర్చులు రూ.5 వేలు ఇవ్వాలని చెన్నై షాపింగ్‌మాల్‌ను ఆదేశించింది.
ఇదీ చూడండి..