భవన నిర్మాణ రంగానికి లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చినా.. ఇంకా పూర్తిస్థాయిలో పనులు ప్రారంభం కాలేదు. ఈ తరుణంలో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా సతమతమవుతున్నారు. మట్టి, రాళ్లు, మేస్త్రీ, పార, సెంట్రింగ్, డ్రైనేజీ, కార్పెంటర్, ఎలక్ట్రికల్, వెల్డింగ్, లప్పం, ప్లోరింగ్, స్టోన్ పాలిషింగ్, గ్లాస్ కట్టింగ్, రంగులు వేయడం తదితర పనులు చేసేవారిని భవన నిర్మాణ కార్మికులు అంటారు. వారిని అసంఘటిత కార్మికులు అని కూడా పిలుస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది
కార్మిక శాఖ వద్ద నమోదు చేసుకున్న లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు ఉన్నారు. నమోదు చేసుకోని కార్మికులు మరో ఆరు లక్షలు ఇలా.. మొత్తంగా సుమారు 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటారని కార్మిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం భవన నిర్మాణాలు, నీటి పారుదల ప్రాజెక్టులు, రోడ్డు నిర్మాణాలు, ఫై ఓవర్లు, రైలు మార్గాలు, మెట్రో రైలు మార్గాలు, విమానాశ్రయ నిర్మాణ పని ఇలాంటి పనులు ఎక్కడ ఉంటే అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని వీరు పని చేస్తుంటారు. ఇటువంటి వారిలో సుమారు 85 శాతం మందికి సొంత నివాసాలు ఉండవని భవన నిర్మాణ రంగ కార్మికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రజల సొంత ఇళ్లను నిర్మిచే వీరికి సొంత ఇళ్లు కట్టించుకునే స్థోమత లేదని భవన నిర్మాణ కార్మికులు వాపోతున్నారు.
నిత్యావసరాలు కొనేందుకు డబ్బులు లేవు
భవన నిర్మాణ రంగానికి లాక్డౌన్ నుంచి ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. భౌతిక దూరం పాటిస్తూ.. పనులు చేసుకునేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. లేబర్ క్యాంపుల వద్ద చేపట్టాల్సిన చర్యలపై కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. కానీ అనుకున్నంత స్థాయిలో పనులు మొదలు కాకపోవడం వల్ల భవన నిర్మాణ రంగ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రెండు నెలల నుంచి పనులు లేవు. ఇప్పుడు అరకొర పనులు మాత్రమే కొనసాగుతున్నాయని వారు కన్నీళ్ల పర్యాంతమయ్యారు. అంతో ఇంతో వెనకేసుకున్న డబ్బులు లాక్డౌన్లో ఖర్చయిపోయాయని చెబుతున్నారు. ఇప్పుడు తమ ఇంట్లో నిత్యావసరాలు కొనేందుకు డబ్బులు లేవని, ఇంటి అద్దెలు కూడా కట్టలేకపోతున్నామని అంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సెస్ నిధులు రూ.1,800 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రైవేట్ నిర్మాణ సంస్థల ద్వారా నిర్మించిన కట్టడాల ద్వారా సమకూరిన డబ్బు విలువ ఆధారంగా ఒక్క రూపాయి సెస్ ఎప్పటికప్పుడు కార్మికుల సంక్షేమ నిధిలో జమచేస్తుంటారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సేవా సంఘం ఛైర్మన్ కె. లక్షయ్య చెబుతున్న లెక్కల ప్రకారం 2014 నుంచి 2020 వరకు రూ.1,800 కోట్ల రూపాయలు జమ అయిందన్నారు. ఇది కేవలం ప్రభుత్వ కట్టడాల ద్వారా నిర్మించిన పనుల నుంచి మాత్రమే సమకూరిన సెస్‌గా ఆయన చెప్పారు. ప్రైవేట్ నిర్మాణాల ద్వారా సమకూరిన సెస్ ఖర్చు విషయాలను ఇంతవరకు ప్రభుత్వం లెక్కలు చూపించలేదని ఆయన ఆరోపించారు. దీనికి ప్రధాన కారణం బోర్డు అధికారులను నియమించకపోవడమే అని రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సేవా సంఘం నాయకులు అభిప్రాయపడుతున్నారు. తమ సంఘంలో ఒక లక్షా 35 వేల సభ్యులను నమోదు చేయించామంటున్నారు.
సాయం అందించాలని విజ్ఞప్తి...
ఐడీ కార్డులు కలిగి ఉన్న ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి నెలకు రూ.1,500 చొప్పున మూడు నెలల పాటు చెల్లించాలని రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సేవా సంఘం డిమాండ్ చేస్తోంది. సంక్షేమ బోర్డు వద్ద ఉన్న సెస్ రూ.1,800ల కోట్ల నుంచి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.334 కోట్లు తీసుకుందని సంఘం సభ్యులు చెబుతున్నారు. కానీ తమకు మాత్రం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ వాటా కింద రూ.750 కోట్లు సంక్షేమ బోర్డు ఖాతాలోకి జమచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల సొంత ఇంటి నిర్మాణం కోసం 100 చదరపు గజాల ప్లాటును ఇవ్వడంతోపాటు సంక్షేమ బోర్డు నుంచి తగు సాయం అందించాలన్నారు.
ఇదీ చూడండి : కశ్మీర్ యాపిల్ కంటే రుచి బాగుంది: ప్రశాంత్ రెడ్డి