శిరస్త్రాణం పెట్టుకోండిరా బాబు అంటే.. జుట్టు చెరిగిపోతుందనే వారు కొందరైతే.. ఊపిరాడదు, ఇబ్బందిగా ఉంటుందని మరికొందరి వాదన. హెల్మెట్ లేకుండా పోలీసులకు చిక్కితే ఏదో సాకుచెప్పి.. లేదా ఎంతో కొంత ఫైన్ కట్టి వెళ్లిపోదామనుకువాళ్లు నిత్యం చాలా మంది తారసపడుతుంటారు. కానీ ఓ కానిస్టేబుల్ సైకిల్‌పై నిత్య 20 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తూ కూడా శిరస్త్రాణం ధరించకుండా కాలుబయట పెట్టడు. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే..
చైతన్యపురికి చెందిన సురేష్ (constable suresh)... పేట్లబురుజు హెడ్‌క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నిత్యం చైతన్యపురి నుంచి పేట్లబురుజుకు సైకిల్‌పై 20 కి.మి. ప్రయాణం చేస్తుంటాడు. ఇందులో గొప్పవిషయం ఏముందనుకోవచ్చు. ఇతను వెళ్లేది సైకిల్‌పైనే అయినా ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తాడు. సైకిల్‌పై వెళ్తున్నా శిరస్త్రాణం ధరిస్తాడు.
పలు ప్రమాదాల సమయంలో శిరస్త్రాణం ధరించక మరణించిన వారు, గాయపడిన వారిని ప్రత్యక్షంగా చూసిన తాను.. ఇలా చేస్తున్నానని చెబుతున్నాడు. అంతే కాకుండా రోజు సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు పర్యావరణానికి హాని కలగదని చెబుతున్నాడు.
గతం కొంతకాలంగా సైకిల్‌పై డ్యూటీకి వెళ్తున్నాను. హెల్మెట్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి, ఫిట్నెస్ కాపాడుకోడానికి, నావంతు బాధ్యతగా కాలుష్యాన్ని తగ్గించడానికి సైకిల్‌పైనే వెళ్తున్నాను.
సురేష్, కానిస్టేబుల్
ఈ రోజుల్లో బైక్‌పై వెళ్లే చాలామంది శిరస్త్రాణం ధరించడం లేదు. అలాంటిది సైకిల్‌పై వెళ్తున్న సురేశ్ చేస్తున్న పని ఆదర్శవంతంతో పాటు అభినందనీయం.
ఇదీ చూడండి: ACCIDENT: అతివేగంతో ప్రయాణం.. అదుపుతప్పి ముగ్గురు దుర్మరణం