Jaggareddy Fire On Trs: రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు వస్తున్నాడని తెలిసి జీవో విడుదల చేశారా అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి యూనివర్శిటీకి ఎందుకెళ్లలేదని నిలదీశారు. మీరు సీఎంను ఓయూ తీసుకెళ్తారా.. లేదా రాహుల్ గాంధీ పర్యటనుకు అనుమతిస్తారా తెరాస నేతలకు సవాల్ విసిరారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను ఎప్పటికీ సమైక్యవాదినేనని జగ్గారెడ్డి పునరుద్ఘాటించారు. తాను ఎప్పుడు నేరుగానే మాట్లాడతానని స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో కేసీఆర్‌ను ఉరికిచ్చి కొడతానన్న తెదేపా నేతలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకరరావు తెరాస ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రులు కాదా అని ప్రశ్నించారు.
తెరాస ప్రభుత్వం యూనివర్శిటీలను గాలికొదిలేసింది. రాహుల్ గాంధీ ఓయూ పర్యటన ఎందుకు వద్దంటున్నారు? రాహుల్ వస్తున్నందుకే జీవో బయటకు వచ్చిందా? ఈ రోజే ఆ జీవోను ఎందుకిచ్చారు? సమైక్య రాష్ట్రంలో ఓయూకు ఎవరైనా వచ్చేవారు. తెలంగాణ వచ్చాక యూనివర్శిటీలోకి వెళ్లకూడదా? విద్యార్థులను కలిసేందుకు మా నాయకుడు వెళ్తే మీకేంటీ? ఓయూ మొత్తం పోలీసులకు అప్పగించిర్రు. కేసీఆర్ ఇప్పటివరకు ఓయూకు ఎందుకు వెళ్లలేదు? ఓయూకు వెళ్తే విద్యార్థుల ఆగ్రహానికి గురి అవుతారనే భయపడి పోలేదు. రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతిస్తారా.. లేదా మీ ముఖ్యమంత్రిని ఓయూకు తీసుకెళ్తారా?- జగ్గారెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్
మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసలైన సమైక్యవాదులే కదా అని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో తెరాస కార్యకర్తలను ఉరికించి కొట్టిన దానం నాగేందర్ ఇప్పుడు అదే పార్టీలోనే ఉన్నారు కదా ఎద్దేవా చేశారు. ఈ జాబితా పరిశీలిస్తే తెరాసలో ప్రభుత్వంలో ఉన్న సమైక్యవాదులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పుడున్న తెరాస నేతలు, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పరోక్షంగా సమైఖ్యవాదులే కదా అని చెప్పుకొచ్చారు.
రాహుల్‌గాంధీని పదేపదే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రావద్దని మాట్లాడుతున్న ఆ పార్టీ నేతలు ఎవరు...? ఓయూ ఏమైనా మీ జాగీరా అని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. రాహుల్‌గాంధీ పట్ల వ్యతిరేకంగా మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే రేపు యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, ఓయూ కాంగ్రెస్ నేతలు ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. సీఎం, కేటీఆర్, మంత్రులను దృష్టిలో పెట్టుకుని మే 4వ తేదీన తాను మంత్రుల నివాస ప్రాంగణానికి వస్తున్నానని ప్రకటించారు. క్షమాపణ చెప్పేంతవరకు మా నిరసనలు ఆపేది లేదని.. మే 6,7 తేదీల్లో రాహుల్‌గాంధీ పర్యటన ముగిసిన తర్వాత తెరాస ప్రభుత్వంపై తమ ఉద్యమ కార్యాచరణ మళ్లీ ప్రకటిస్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చూడండి: Bandi Sanjay Praja Sangrama Yatra: 'కొన్నాళ్లు ఓపిక పడితే వచ్చేది భాజపా ప్రభుత్వమే