Manikkam tagore tour: రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ రేపు హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా రాజకీయాల పరిస్థితులపై రెండు రోజులపాటు నేతలతో చర్చించనున్నారు. సీనియర్ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై పలువురితో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి గాంధీభవన్‌లో జరిగే పీసీసీ ఆఫీస్ బేరర్స్, డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పాల్గొంటారు.
ఇటీవల వరంగల్‌లో జరిగిన రైతు రచ్చబండ కార్యక్రమంలో ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్‌ను జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికపై చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడంతోపాటు... ఆయా జిల్లాల అధ్యక్షుల నుంచి నివేదికలు కోరనున్నారు. నియోజక వర్గాల వారీగా నివేదికలు తెప్పించుకుని.. ఆయా నియోజక వర్గాల్లో ముఖ్య నాయకులంతా అందులో పాల్గొన్నారా లేదా ఆరా తీయనున్నారు.
ఒకవేళ పాల్గొనకపోతే ఎందుకు పాల్గొనలేదనే విషయంపై తదితర అంశాలపై ఆరా తీయనున్నారు. రైతు రచ్చబండ కార్యక్రమాలకు సంబంధించి సమగ్ర నివేదిక ఏఐసీసీకి నివేదించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు జగ్గారెడ్డిల మధ్య చోటు చేసుకున్న విమర్శలు, ప్రతి విమర్శలపై ఆరా తీయనున్నారు. ఇప్పటికే ఈ విషయమై ఏఐసీసీ దృష్టికి వెళ్లడంతో.. పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వి.హనుమంతురావుతో కూడా మాణిక్కం ఠాగూర్ సమావేశమై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: తెరాస సర్కార్‌పై పోరాటానికి భాజపా 'ఆర్టీఐ' అస్త్రం..!