Congress Strategy Telangana Assembly Election 2023 : అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో జోరు పెంచిన కాంగ్రెస్ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల(Telangana Election 2023) వరకు అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో చతుర్ముఖ వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ప్రధానంగా నాలుగు అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. అవేంటంటే..? సీట్లు రాని నేతల నుంచి అసమ్మతి చెలరేగకుండా చూస్తూనే..., బస్సుయాత్రతో నేతల ఐక్యతా సందేశాన్ని పంపేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఆరు గ్యారంటీలను జనంలోకి తీసుకెళ్లడం, కలిసొచ్చే పార్టీలతో అనుసరించాల్సిన వ్యూహాలపైనా హస్తం పార్టీ ప్రణాళికలు రూపొందించే పనిలో పడింది.
Telangana Congress Strategy For Election 2023 : మొదటగా.. టికెట్ దక్కని నేతల అసమ్మతిని చల్లార్చే అంశంపై దృష్టి సారించింది. అధిష్ఠానం జోక్యంతో కొన్నిరోజులుగా నాయకులంతా ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా, అభ్యర్థుల ఎంపిక విషయంలో కొందరి మధ్య సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో ఇచ్చే సర్వే నివేదికలను ఆధారంగా చేసుకొని ముందుకెళ్తున్నా.. కొన్ని నియోజకవర్గాల విషయంలో నాయకులు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ(Congress Screening Committee)లో కొన్ని సీట్ల విషయంలో నాయకుల మధ్య గట్టిగానే వాదనలు జరిగినట్లు సమాచారం. చివరకు సునీల్ కనుగోలు సర్వే నివేదికల ఆధారంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
Telangana Congress Election Plan 2023 : ఇటీవల సీడబ్ల్యూసీ(CWC Meeting 2023) సమావేశాల సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేను చేర్చుకునే విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఓ సీనియర్ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఈయన.. తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఇటీవల మళ్లీ కాంగ్రెస్‌లో చేరడానికి ప్రయత్నించగా ఇప్పటికే అక్కడ అభ్యర్థి ఉన్నందున కొత్తగా మరొకరిని చేర్చుకోవడం వల్ల సమస్యలొస్తాయంటూ పీసీసీ అధ్యక్షుడు తిరస్కరించినట్లు తెలియవచ్చింది. దీంతో ఖర్గేను కలవడానికి వచ్చిన ఆయన.. తిరిగి వెళ్లిపోయి బీజేపీలో చేరి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం చేరిక విషయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తొలుత అంత సానుకూలంగా లేకపోయినా.. తర్వాత కొందరు నాయకుల జోక్యంతో సంసిద్ధత వ్యక్తం చేశారు. భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి బీఆర్ఎస్లో చేరిన అనిల్‌కుమార్‌రెడ్డి ఇంటికి రేవంత్‌రెడ్డి వెళ్లి తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన రెండు నియోజకవర్గాలకు కాబోయే అభ్యర్థులుగా ప్రచారం జరుగుతున్న వారు దిల్లీలో కాంగ్రెస్‌లో చేరే సమయంలో కోమటిరెడ్డి లేకపోగా, కొందరు నాయకుల వద్ద తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం.
Telangana Congress Four Formula Plan : ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కొన్ని నియోజకవర్గాలకు వేర్వేరు పేర్లను చెప్పినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా కొత్తపేర్లు తెరపైకి వచ్చినట్లు తెలియవచ్చింది. ఒకటో తేదీన మళ్లీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నాటికి మరిన్ని పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
దశలవారీగా అభ్యర్థుల్ని ప్రకటిస్తామని రేవంత్ చెబుతున్నప్పటికీ.. ఎక్కువ సీట్లను ప్రకటించడం ద్వారా ఒకేసారి సమస్యను పరిష్కరించవచ్చని అధిష్ఠానం భావిస్తోంది. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే నాయకులంతా బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమానికి రూపకల్పన చేస్తోంది. ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారెంటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణతో పాటు బీఎస్పీ, వామపక్షాలు సహా ఇతర పార్టీలతో ఎలా వ్యవహరించాలి, ఆ పార్టీలు చీల్చే ఓట్ల ప్రభావం ఎక్కడ.. ఎలా ఉంటుందన్న అంశాలపై లోతుగా చర్చిస్తున్నట్లు తెలిసింది.
BC MLA Ticket issue in Congress Telangana : బీసీలకు 34 సీట్లు.. రాష్ట్ర నేతల డిమాండ్‌పై ఏఐసీసీ ఫైర్