దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు మేలు చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. రేపు జరగనున్న భారత్ బంద్‌కు తెలుగురాష్ట్రాలు మద్దతివ్వాలని ఆయన కోరారు. నాలుగు నెలలుగా దిల్లీ సరిహద్దులో రైతులు పోరాటం చేస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కార్పొరేట్లకు వత్తాసు పలుకుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని అందరూ వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు.
అన్ని వర్గాలు బంద్‌లో పాల్గొని భారత్ బంద్‌ను విజయవంతం చేయాలన్నారు. తెరాస ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లతో నిరసన చేస్తున్న రైతులకు అండగా అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గతంలో రైతుల ఆందోళనకు మద్దతు ఇచ్చిన తెరాస.. ఆ తర్వాత వెనక్కి తగ్గిందని... రేపటి బంద్‌తో ఈ విషయం బహిర్గతమవుతుందని వీహెచ్ పేర్కొన్నారు.