మహబూబ్‌నగర్ జిల్లా కరవు గురించి నిన్నటి దాకా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఇప్పుడు నీళ్లు తీసుకోండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలా చెబుతారని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులకు కనీసం బేసిన్ అనే పదానికి అర్థం తెలియదని ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడంపై హైదరాబాద్‌లోని సోమాజిగూడా ప్రెస్ క్లబ్లో అఖిలపక్షం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
'మహబూబ్‌నగర్ కరవు గురించి మాట్లాడుతూ... కృష్ణా జలాలను ఆంధ్ర వాళ్లని తీసుకోండి అని సీఎం కేసీఆర్ చెప్పడం ఎంతవరకు సరైంది?. ఈ నీటి సమస్యను గురించి సుప్రీం కోర్టు ప్రస్తావించింది. కృష్ణా నది నుంచి నీటిని తీసుకుపోతున్నామని ఏపీ మంత్రులు చెబుతున్నారు. దీనిపై సీఎం సమాధానం చెప్పాలి. '
నాగం జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై గతంలోనే జిల్లా తరఫున అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వద్దకు వెళ్లామని... అప్పుడు వెంటనే ప్రాజెక్టు పనులు ప్రారంభించేలా ఆదేశాలు ఇచ్చారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఏపీ ప్రభుత్వం నీళ్లు దోచుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. శ్రీశైలం నిండకుండానే పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకెళ్తున్నా ఒక్కరూ మాట్లాడటం లేదని కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ విమర్శించారు.
'పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కొత్తది కాదు. దీనిపై మేమందరం కలిసి నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కలిశాం. ఈ ప్రాజెక్ట్ ప్రజలకు చాలా అవసరమని కోరాం. అక్కడికక్కడే రూ.6కోట్లు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టును వేగంగా పుర్తి చేయాల్సిన అవసరం ఉంది. బోర్డు ఆదేశాలిచ్చినా... ఎవరూ పట్టించుకోవడం లేదు. రాజ్యంగం ద్వారా ఏర్పాటైన ప్రభుత్వాలు... ఆ రాజ్యంగ సంస్థల ఆదేశాలను పట్టించుకోకపోవడం ఎంతవరకు సరైందో ఆత్మ విమర్శ చేసుకోవాలి.'
-రావుల చంద్రశేఖర్ రెడ్డి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు
తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నీళ్లు- నిజాలు పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో పాటు కాంగ్రెస్ నేత సంపత్ కుమార్, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, భాజపా అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోంది: కేంద్రానికి జగన్ లేఖ