మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి.. సీఎల్పీ కార్యాలయంలో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మానిక్కం ఠాగూర్.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎల్పీ కార్యాలయంలో సీఎల్పీ నేత, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే ఆయనను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. అసలు కార్యాలయంలో ఏం జరిగిందో వివరణ ఇవ్వాలని నేతలను ఆదేశించారు. సంఘటనపై భట్టి విక్రమార్క, ఇతర నాయకులు వివరణ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
అసలేం జరిగింది..
రెండు రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన జేసీ.. సీఎల్పీ కార్యాలయంలో పార్టీ నేతలను కలిశారు. వారితో సరదాగా ముచ్చటించిన ఆయన.. కాంగ్రెస్‌పై చురకలంటించారు. రాష్ట్రాన్ని విభజించి సోనియాగాంధీ తప్పు చేశారని జేసీ అన్నారు. మరో రెండు, మూడేళ్లలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మానిక్కం ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: నూతన సచివాలయ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్