Governor Meeting Congress Leaders At Raj Bhavan: ప్రతిరోజు ప్రభుత్వం, ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలను చూస్తున్నట్లు గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ కాంగ్రెస్ నాయకులతో వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తున్నానని.. బాగా మాట్లాడుతున్నారని కితాబు ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. రేవంత్ రెడ్డితో సహా పది మంది కాంగ్రెస్ నాయకులు గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్‌ను ఇవాళ రాజ్‌భవన్‌లో కలిసిన సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు వారు పేర్కొన్నారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం చాలా పెద్దదని.. లక్షలాది మంది నిరుద్యోగులతో ముడిపడిన అంశంగా పరిగణిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నట్లు కాంగ్రెస్ నేతలు వివరించారు. ఈ పేపర్ లీకేజీ కేసులో జరుగుతున్న పరిణామాలను రోజురోజుకూ తెలుసుకుంటున్నట్లు గవర్నర్ వారితో అన్నట్లు చెప్పారు. ఈ విషయంపై సాధ్యాసాధ్యాలను పరిష్కరించడానికి లీగల్ సెల్‌ను సంప్రదించి.. లక్షలాది మంది విద్యార్థులకు న్యాయం చేస్తానని గవర్నర్ తెలిపారని వెల్లడించారు.
Congress Leaders At Raj Bhavan: టీఎస్‌పీఎస్సీ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరిన రేవంత్ రెడ్డి రాజ్యాంగంలోని ఆర్టికల్ 317, విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌కు ఉన్న విచక్షణాధికారాలను గుర్తు చేస్తూ ఓ లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చారు. అదేవిధంగా టీఎస్పీఎస్సీపై పూర్తి అధికారం గవర్నర్‌కు ఉంటుందని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులతో పాటు రాజ్యాంగం ప్రకారం ఆమెకు ఉన్న అధికారాలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు.
ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరపడం లేదన్న కాంగ్రెస్ నేతలు.. దర్యాప్తు సరియైన దిశలో నడిచేట్లు చూడాలని రేవంత్ రెడ్డి ఆమెను కోరినట్లు తెలిపారు. అదేవిధంగా ఈ లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసినట్లు.. మంగళవారం న్యాయస్థానంలో జరిగిన విచారణ తీరును గవర్నర్‌కు వివరించినట్లు పేర్కొన్నారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి, అనితా రామచంద్రన్‌ను కూడా సిట్ విచారించాలని సూచించారు. వెంటనే గవర్నర్ తన విచక్షణ అధికారాలను ఉపయోగించి ఛైర్మన్, కార్యదర్శి ఇంకా మిగిలిన సభ్యులను తొలగించాలని కోరారు.
మంత్రి కేటీఆర్ ఇద్దరే వ్యక్తులను దోషులుగా చూపడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ లెక్కన చూస్తే మిగిలిన సభ్యులను రక్షించే విధంగా ఐటీ మంత్రి వైఖరి ఉందని ఆరోపించారు. కచ్చితంగా ఇది ఐటీశాఖ పరిధిలోని వారే చేశారని ధ్వజమెత్తారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆటలు ఆడుతోందని మండిపడ్డారు.
ఇవీ చదవండి: