New Josh in T Congress with Operation Akarsh : రాహుల్‌గాంధీ భారత్ జోడోయాత్రతో పాటు కర్ణాటక పగ్గాలు కాంగ్రెస్ చేతికి రావడంతో... పార్టీలో వచ్చిన జోష్‌ను మరింత పెంచేందుకు హస్తం ప్రయత్నిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా చేరికలను ముమ్మరం చేసి తద్వారా పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని పెంచే దిశలో ముందుకు వెళ్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని సాదరంగా స్వాగతిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇంఛార్జి ఠాక్రేలు స్పష్టం చేసిన తరువాత.. చేరికల ప్రయత్నాలు పుంజుకున్నాయి. బీఆర్ఎస్, బీజేపీల్లో అసంతృప్తి నేతలు, టికెట్లు దక్కే అవకాశం లేదని అంచనాలో ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను లాక్కునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్‌తోపాటు రాష్ట్ర పీసీసీ నాయకత్వం తరఫున సీనియర్ నేత మల్లు రవి లాంటి కొందరు నేతలు చేరికల పనిలో నిమగ్నమయ్యారు.
BRS Leaders to Join Congress : కుమారుడికి టికెట్ ఇచ్చినట్లయితే.. పార్టీ మారేందుకు తనకు అభ్యంతరం లేదని నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి... తెగేసి చెబుతున్నారు. అందులో భాగంగా ఇటీవల ఆయన మల్లు రవితోపాటు, కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డిలను కలిసి చర్చించారు. మరో వైపు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా హస్తం నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కొన్ని షరతులు పెడుతున్నట్లు సమాచారం. ప్రధానంగా తనకు టికెట్ ఇవ్వడమే కాకుండా మరో రెండు మూడు నియోజకవర్గాల్లో తాము సూచించిన వారికి టికెట్లు ఇస్తే... తానే ఎన్నికల ఖర్చు భరించి గెలిపించుకుంటానని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో సర్వేల ద్వారా టికెట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.. చేరికల సమయంలో తగిన హామీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
- BRS Leaders Joining in Congress : 'కారు' దిగి.. 'చేయి' అందుకునేందుకు రెడీగా ఉన్న నేతలు వీళ్లే
Congress Operation Akarsh in Telangana : నిర్మల్‌లో ఏలేటి మహేశ్వర రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లడంతో అక్కడ హస్తం పార్టీకి అభ్యర్థి కరవయ్యారు. దీంతో అక్కడి బీఆర్ఎస్ నాయకుడు శ్రీహరిని రెండు రోజుల క్రితం పార్టీలో చేర్చుకున్నారు. ఈ మేరకు నిర్మల్‌లో గట్టి పోటీ ఇవ్వగలిగిన అభ్యర్థిని బరిలో దించనున్నట్లు కాంగ్రెస్ శ్రేణులకు బలమైన సంకేతాలను పంపించినట్లయ్యింది. రేవంత్ రెడ్డి క్షణం తీరిక లేకుండా పార్టీలో చేరికలు, డిక్లరేషన్‌లు, మ్యానిఫెస్టోలపై పూర్తి సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. నిన్న వివిధ నియోజకవర్గాల నుంచి కొందరు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. చేరికల విషయం మూడో కంటికి తెలియకుండా రహస్యంగా కాంగ్రెస్ ఆపరేషన్ చేస్తోంది. అంతేకాదు ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని ఏ నాయకుడు కలుస్తున్నాడో తెలియకుండా చాపకింద నీరులా ముందుకు వెళ్తుంది. హస్తం పార్టీలోకి రావాలనుకునే కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు.. రేవంత్ రెడ్డితో హైదరాబాద్‌లో కాకుండా బెంగళూరులో భేటీ అవుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఇలా చేయడం వల్ల ఎవరు ఎవరిని కలిశారన్న విషయం బయటకు వెళ్లకుండా ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు సరైన అభ్యర్ధులు లేరు : హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండడంతో.. ఈ రెండు జిల్లాల పరిధిలో అధికార పార్టీ నేతలను చేర్చుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి బలమైన నాయకులు లేని నియోజకవర్గాలు, అసలు అభ్యర్ధులు లేని నియోజకవర్గాలను.. బయట నుంచి వచ్చే నాయకులతో భర్తీ చేస్తారు. కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందంతోపాటు, పీసీసీకి అత్యంత సన్నిహతంగా ఉన్న నాయకులను క్షేత్రస్థాయికి పంపించి సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా హైదరాబాద్‌లో సనత్ నగర్, అంబర్‌పేట్, ఎల్బీనగర్, తుంగతుర్తి, నకిరేకల్ ఇలా 20కిపైగా నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌కు సరైన అభ్యర్ధులు లేరు. వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే అవకాశం లేదని.. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి సంకేతాలు అందుకున్న నాయకులు కాంగ్రెస్ పంచన చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ హామీపై స్పష్టత లేక... పొంగులేటి, జూపల్లి రాకలో జాప్యం : అయితే పార్టీ మారాలనుకుంటున్ననాయకులు ప్రతి ఒక్కరు టికెట్ గ్యారంటీ అన్న హామీతోనే సుముఖత చూపిస్తున్నారు. సర్వేల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయాలని పీసీసీ నిర్ణయించడంతో ఇతర పార్టీ నాయకులు చొరవ చూపుతున్నప్పటికీ.. హస్తం నేతలు తగిన హామీ ఇవ్వలేకపోతున్నారు. మాజీ మంత్రి జూపల్లి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిల టికెట్ల హామీపై స్పష్టత రాకపోవడంతో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో టికెట్లు ఇచ్చేది.. పార్టీ అధిష్ఠానం కావడంతో దిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమై.. టికెట్లు విషయంలో తగిన హామీ తీసుకుని పార్టీలో చేరతారని కాంగ్రెస్‌వర్గాలు వెల్లడించాయి.
ఇవీ చదవండి :
- joinings in Telangana Congress : కాంగ్రెస్‌లో చేరికల కోలాహలం.. పొంగులేటి, జూపల్లి చేరేదప్పుడే..!
- Revanthreddy on Congress Tickets : 'సర్వేల ప్రాతిపదికనే టికెట్లు.. ఈ 6 నెలలు కష్టపడి పనిచేయండి'
- Telangana Politics : కేసీఆర్‌కు చెక్ పెట్టేందుకు.. బీజేపీ మినహా విపక్షాలన్నీ ఒక వేదికగా ఏర్పడేందుకు సిద్ధం..!