ఫ్రెండ్లీ పోలీస్ ప్రజలకు కాదని తెరాస నాయకులకేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ జన్మదినం రోజున ఈ ఘటన జరగడం న్యాయవ్యవస్థకు చీకటి దినంగా మిగిలిపోతుందని విమర్శించారు. కేసీఆర్ హాలియాలో జరిగిన సభలో తెరాసకు ఎదురు తిరిగితే నాశనమవుతారని అనడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. తెరాసను వ్యతిరేకించిన ఇద్దరిని చంపి కేసీఆర్‌కు పుట్టిన రోజు కానుకగా ఇచ్చారా అంటూ నిలదీశారు. తెలంగాణలో పరిస్థితులు ఎటు దారితీస్తున్నాయో విద్యార్థులు, మేధావులు ఒకసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
శీలం రంగయ్య ఇదే ప్రాంతంలో లాకప్ డెత్‌కు గురయ్యాడని ఆ విషయంలో స్థానిక పోలీసులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయన్నారు. లాకప్ డెత్ కేసులో కోర్టులో నిన్న హతమైన దంపతులే వాదనలు వినిపించారని జీవన్ రెడ్డి తెలిపారు. స్థానిక పోలీసులతో న్యాయం జరగదని... సీబీఐతో లేక సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. తెరాస అరాచకాలకు పోలీసు యంత్రాంగమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'వామన్‌రావు దంపతుల హత్య కేసును సీఐడీకి ఇవ్వండి'